తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆ విషయంలో ఆందోళన లేదు.. వాటిని సరిచేసుకుంటా'

దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో తన ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉందన్నాడు టీమ్‌ఇండియా పేసర్‌ అవేశ్‌ ఖాన్‌. ఈ ప్రదర్శనను తన తండ్రికి అంకితమిస్తున్నట్లు తెలిపాడు. మరోవైపు.. ఈ మ్యాచ్​లో సీనియర్‌ బ్యాటర్​ దినేశ్‌ కార్తీక్‌ ప్రత్యర్థి బౌలర్లను చితక్కొట్టాడని కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ హర్షం వ్యక్తం చేశాడు.

avesh khan
ఆవేశ్ ఖాన్​

By

Published : Jun 18, 2022, 10:54 AM IST

IND VS SA Avesh khan: దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో తాను చేసిన అద్భత ప్రదర్శనను తన తండ్రికి అంకితం చేస్తున్నట్లు తెలిపాడు టీమ్‌ఇండియా పేసర్‌ అవేశ్‌ ఖాన్‌. ఈ సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో వికెట్లేమీ తీయలేకపోయిన అతడు ఈ మ్యాచ్‌లో 4/18 చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. దీంతో టీమ్‌ఇండియా 82 పరుగుల తేడాతో భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన అవేశ్‌ తన ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉందన్నాడు.

"ఈ ప్రదర్శనతో చాలా సంతోషంగా ఉంది. మా నాన్న పుట్టినరోజు కూడా నేడే. నా అత్యుత్తమ ప్రదర్శనను ఆయనకు అంకితమిస్తున్నా. ఇక్కడ నేనేం ప్రణాళికలు రచించలేదు. సహజసిద్ధంగా బౌలింగ్‌ చేసి వికెట్లకేసి విసరాలనుకున్నా. ఈ పిచ్‌ వైవిధ్యంగా ఉంది. బంతి కొన్నిసార్లు బౌన్స్‌ అయ్యింది.. కొన్నిసార్లు కింద నుంచి వెళ్లింది. దీంతో కాస్తంత బౌన్స్‌ ప్రదర్శించి సరైన లెంగ్త్‌లో వేయాలనుకున్నా. అలాగే రిషభ్‌ పంత్‌ కూడా పరిస్థితులకు తగ్గట్టు ఎలా బౌలింగ్‌ చేయాలో చెప్పాడు. దాంతో జాన్సెన్‌, మహారాజ్‌ల వికెట్లు సాధించా. మరోవైపు జట్టుగా మేం బాగా ఆడుతున్నాం. ఫీల్డింగ్‌, బౌలింగ్‌ బాగా చేస్తున్నాం. దీంతో ఆఖరి మ్యాచ్‌ను కూడా ఆస్వాదించాలనుకుంటున్నాం. అక్కడ ఎవరు గెలిస్తే వారిదే సిరీస్‌. మేం విజయం సాధించడానికి తప్పకుండా కృషి చేస్తాం" అని అవేశ్‌ చెప్పుకొచ్చాడు.

IND VS SA Dinesh Karthik: ఇక ఈ మ్యాచ్​లో సీనియర్‌ బ్యాటర్​ దినేశ్‌ కార్తీక్‌ ప్రత్యర్థి బౌలర్లను చితక్కొట్టాడని కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ హర్షం వ్యక్తం చేశాడు. "మేం బాగా ఆడాలని ప్రణాళికలు వేసుకొని బరిలోకి దిగాం. దీంతో ఇలాంటి ఫలితం వచ్చింది. ఏ జట్టు బాగా ఆడితే అదే గెలుస్తుంది. తర్వాతి మ్యాచ్‌లోనైనా టాస్‌ గెలుస్తానేమో చూడాలి. హార్దిక్‌ ఆడిన తీరుకు చాలా సంతోషంగా ఉంది. మరోవైపు డీకే వచ్చీ రాగానే దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికి ఆరేశాడు. వీరిద్దరి బ్యాటింగ్‌ మాకు సానుకూలంగా మారింది. ఇక వ్యక్తిగతంగా నేను మెరుగవ్వాల్సిన అంశాలు ఉన్నాయి. వాటిని సరిచేసుకుంటా. నా బ్యాటింగ్‌ విషయంలో ఆందోళన లేదు.. కానీ, సానుకూల అంశాలను పరిగణనలోకి తీసుకొని మెరుగవ్వడానికి ప్రయత్నిస్తా. బెంగళూరులో చివరి మ్యాచ్‌లో విజయం సాధించడానికి 100 శాతం కృషి చేస్తాం" అని పంత్‌ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా 13 ఓవర్లకు 81/4తో కష్టాల్లో పడింది. ఆ సమయంలో జోడీ కట్టిన హార్దిక్‌ పాండ్య (46; 31 బంతుల్లో 3x4, 3x6), దినేశ్‌ కార్తీక్‌ (55; 27 బంతుల్లో 9x4, 2x6) గొప్పగా ఆడారు. వీరిద్దరూ దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో టీమ్‌ఇండియా చివరి ఐదు ఓవర్లలో 73 పరుగులు సాధించి చివరికి 169/6 స్కోర్‌ చేసింది. ఈ క్రమంలోనే డీకే 15 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ టీ20ల్లో తొలి అర్ధశతకం సాధించాడు.

ఇదీ చూడండి: టీమ్ఇండియాపై టిమ్​పైన్​ ఫైర్.. ప్రమాదంలోకి నెట్టేశారంటూ..

ABOUT THE AUTHOR

...view details