IND vs SA: హార్దిక్ పాండ్య నుంచి టీమ్ఇండియా ఆశించిన దాన్ని శార్దూల్ ఠాకూర్ నెరవేరుస్తున్నాడని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఏడు వికెట్లతో చెలరేగాడు. దీంతో కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయడమే కాకుండా బ్యాటింగ్‌లోనూ 28 పరుగులు సాధించి ఆకట్టుకున్నాడు. దీని గురించి ఆకాశ్ స్పందించాడు. ఆల్‌రౌండర్ స్థానం విషయమై హార్దిక్ పాండ్య, శార్దూల్ ఠాకూర్‌ను పోలుస్తూ మాట్లాడాడు.
"బ్యాటింగ్‌లో హార్దిక్ పాండ్య, శార్దూల్ ఠాకూర్‌ను పోల్చడం సరికాదు. బ్యాటింగ్ పరంగా చూస్తే పాండ్య చాలా ముందున్నాడు. పాండ్య భారీ పరుగులు చేయగలడు. ఇక బౌలింగ్‌లో హార్దిక్ కన్నా శార్దూల్ మెరుగ్గా ఉన్నాడు. మ్యాచ్‌లో కీలక వికెట్లు పడగొడుతున్నాడు. శార్దూల్ రెండో టెస్టులో చేసిన ప్రదర్శన అత్యద్భుతం. ఏడు వికెట్లు తీయడమే కాకుండా, బ్యాటింగ్ 24 బంతుల్లో 28 పరుగులు చేశాడు. అయితే, ఆ పరుగులు ఎంత విలువైనవో బుధవారం గుర్తించకపోయి ఉండొచ్చు. కానీ, గురువారం వాటి విలువ తెలుస్తుంది. ఎందుకంటే దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 122 పరుగులే కావాలి. ఒకవేళ శార్దూల్ ఆ పరుగులు చేయకపోయుంటే నేడు దక్షిణాఫ్రికా లక్ష్యం మరింత తక్కువగా ఉండేది. విహారితో కలిసి ఏడో వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పకపోయి ఉంటే టీమ్ఇండియా ఈపాటికే ఇబ్బందికర పరిస్థితుల్లో నిలిచేది."
--ఆకాశ్ చోప్రా, వ్యాఖ్యాత.
మ్యాచ్ విషయానికొస్తే రెండో టెస్టులో భారత్‌పై అధిక్యంలో ఉంది దక్షిణాఫ్రికా. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. భారత్‌పై విజయం సాధించడానికి ప్రోటీస్ జట్టు ఇంకా 122 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో ఎల్గర్(46), వాండర్ డసెన్(11) ఉన్నారు. అయితే.. వర్షం కారణంగా నాలుగో రోజు మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది.