IND vs SA 3rd ODI: దక్షిణాఫ్రికాలో టీమ్‌ఇండియా పర్యటనకు నేడే ముగింపు. ఆ ముగింపు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. టెస్టు సిరీస్‌లో పరాజయం తర్వాత వన్డేల్లోనూ వరుసగా రెండు ఓటములతో సిరీస్ కోల్పోయిన రాహుల్ సేన.. ఆదివారం నామమాత్రమైన చివరి వన్డేలో సఫారీ జట్టుతో తలపడబోతోంది. సిరీస్ పోయినా.. ఈ మ్యాచ్‌లో గెలిచి వైట్‌వాష్ తప్పించుకుని పరువు దక్కించుకోవాలని భారత్ చూస్తోంది. ఈ మ్యాచ్ రాహుల్ నాయకత్వ పటిమకు అతి పెద్ద పరీక్ష అనడంలో సందేహం లేదు. ఈ సిరీస్‌లో అత్యంత విమర్శలు ఎదుర్కొన్న ఆటగాడు అతనే. అందుక్కారణం.. స్థాయికి తగ్గ బ్యాటింగ్ ప్రదర్శన చేయకపోవడానికి తోడు కెప్టెన్సీ వ్యూహాలు పూర్తిగా తేలిపోతుండటమే. రాహుల్ బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ ఏర్పాట్లు ఏమాత్రం పని చేయట్లేదు. తొలి వన్డేలో భారత్ 297 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడ్డ మైదానంలోనే.. 288 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా అలవోకగా ఛేదించడంతో రాహుల్ నాయకత్వంపై విమర్శలు రెట్టింపయ్యాయి. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా రుజువు చేసుకోకుండా ఇకపై ఏ ఫార్మాట్లోనూ అతను ఈ బాధ్యతలు అందుకునే అవకాశం లేనట్లే. అలాగే బ్యాటింగ్‌లో తన శైలిలో మెరుపు, భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం కూడా ఉంది.
మిడిల్ మారదా?
పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్‌ను చాన్నాళ్ల నుంచి వేధిస్తున్న మిడిలార్డర్ సమస్య ఎంతకీ పరిష్కారం కావట్లేదు. సులువుగా గెలవాల్సిన తొలి వన్డేను భారత్ కోల్పోయిందన్నా.. రెండో వన్డేలో భారీ స్కోరు చేసే అవకాశం చేజార్చుకుందన్నా.. అందుకు మిడిలార్డర్ వైఫల్యమే కారణం. శ్రేయస్ అయ్యర్ వైఫల్యంతో 'మిడిల్' సమస్య మరింత పెద్దదవుతోంది. వెంకటేశ్ అయ్యర్ రెండు అవకాశాలను ఉపయోగించుకోలేకపోయాడు. వీళ్లిద్దరూ చివరి వన్డేలో సత్తా చాటి తీరాల్సిందే. గత మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్లో కాస్త ముందు వచ్చిన పంత్.. మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కానీ అతడిచ్చిన ఊపును భారత్ కొనసాగించలేకపోయింది. బౌలరైన శార్దూల్‌ను చూసి బ్యాట్స్‌మెన్ స్ఫూర్తి పొందాల్సిన అవసరముంది. కోహ్లి తన స్థాయి ఇన్నింగ్స్ ఎప్పుడు ఆడతాడో అని అభిమానులు చాన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. సెంచరీ కోసం రెండేళ్లకు పైగా సాగుతున్న నిరీక్షణకు ఈ మ్యాచ్‌లో అయినా తెరదించుతాడేమో చూడాలి.
భువి ఎందుకు?