తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒకటిన్నర రోజుల్లోనే మ్యాచ్ కంప్లీట్- సెకండ్ టెస్ట్​లో భారత్ విజయం- సిరీస్ సమం

IND Vs SA 2nd Test Winner : దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారీ జట్టు నిర్దేశించిన 79 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. దీంతో సిరీస్‌ 1-1తో సమం అయింది.

IND Vs SA 2nd Test Winner
IND Vs SA 2nd Test Winner

By ETV Bharat Telugu Team

Published : Jan 4, 2024, 5:09 PM IST

Updated : Jan 4, 2024, 5:25 PM IST

IND Vs SA 2nd Test Winner :దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారీ జట్టు నిర్దేశించిన 79 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. దీంతో సిరీస్‌ 1-1తో సమం అయింది. తొలి ఇన్నింగ్స్‌ల్లో దక్షిణాఫ్రికా 55, భారత్‌ 153 పరుగులకు ఆలౌట్‌ అయ్యాయి. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీలు 176 పరుగులకు ఆలౌట్‌ కాగా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి భారత్‌ విజయం దక్కించుకుంది.

రెండో ఇన్నింగ్స్​లో 79 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యశస్వీ జైస్వాల్ (28; 23 బంతుల్లో 6 ఫోర్లు) క్రీజులో ఉన్నంతసేపు బౌండరీలతో అలరించాడు. రోహిత్ శర్మ (17*; 22 బంతుల్లో 2 ఫోర్లు) కూడా దూకుడుగా ఆడాడు. విరాట్ కోహ్లీ (12), శుభ్‌మన్‌ గిల్ (10), శ్రేయస్ అయ్యర్ (4*) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ, నండ్రీ బర్గర్, మార్కో జాన్సన్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు ఓవర్‌నైట్ 62/3 స్కోరుతో రెండో రోజు ఆట ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికా మరో 114 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. 36 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన మార్‌క్రమ్ (106; 103 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా (6/61) విజృంభణతో ఆతిథ్య జట్టు మొదటి 10 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓ వైపు మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించకున్నా మార్‌క్రమ్ మాత్రం ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ముకేశ్ కుమార్ 2, సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ ఒక్కో వికెట్ పడగొట్టారు.

సఫారీలను బెంబేలెత్తించిన సిరాజ్
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికాను మహ్మద్‌ సిరాజ్‌ (6/15) బెంబేలెత్తించాడు. నిప్పులు చెరిగే బంతులు సంధించి ఆతిథ్య జట్టుకు పట్టపగలే చుక్కలు చూపించాడు. అతడి ధాటికి దక్షిణాఫ్రికా తొలి సెషన్‌లోనే 23.2 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. 1991లో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత టెస్టుల్లో దక్షిణాఫ్రికాకు అత్యల్ప స్కోరు ఇదే. ఆతిథ్య జట్టులో మిడిల్ ఆర్డర్‌ బ్యాటర్లు డేవిడ్ బెడింగ్‌హమ్‌ (12), వెరినే (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ముకేశ్‌, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు.

కుప్పకూలిన భారత్!
ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (39; 50 బంతుల్లో), వన్‌డౌన్‌ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ (36; 55 బంతుల్లో 5 ఫోర్లు), విరాట్ కోహ్లీ (46; 59 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) నిలకడగా ఆడటంతో తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరు చేసేలా కనిపించింది. కానీ, ఒకే స్కోరు వద్ద చివరి ఆరు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. మొదటి రోజు టీ విరామ సమయానికి 111/4 స్కోరుతో నిలిచిన టీమ్‌ఇండియా.. 11 బంతుల వ్యవధిలో ఆరు వికెట్లను చేజార్చుకుంది. యశస్వి జైస్వాల్ (0), శ్రేయస్ అయ్యర్ (0), రవీంద్ర జడేజా (0) పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరారు. కేఎల్ రాహుల్ (8) కూడా నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ, ఎంగిడి, నండ్రీ బర్గర్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. రెండో టెస్టు కేవలం ఒకటిన్నర రోజుల్లోనే పూర్తయింది. ధోనీ తర్వాత సఫారీ గడ్డపై సిరీస్‌ కోల్పోని రెండో కెప్టెన్‌గా రోహిత్‌ ఘనత సాధించాడు.

స్టంపౌట్ రివ్యూ రూల్​లో ఐసీసీ కీలక మార్పు- ఇక నుంచి అలా చేయడం కుదరదు!

పొట్టి వరల్డ్ కప్​- భారత్‌ X పాక్‌ మ్యాచ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే?

Last Updated : Jan 4, 2024, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details