IND Vs SA 2nd Test :భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఓవర్ నైట్ 62/3 స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన సఫారీ జట్టు మరో 114 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. 176 పరుగులకు ఆలౌట్ అయింది. టీమ్‌ఇండియాకు 79 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
మార్‌క్రమ్ (106; 103 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా (6/61) విజృంభణతో ఆతిథ్య జట్టు మొదటి 10 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓ వైపు మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించనకున్నా 36 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన మార్‌క్రమ్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు.
73 పరుగుల వద్ద మార్‌క్రమ్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను కేఎల్ రాహుల్ వదిలేశాడు. తర్వాత అతడు మరింత రెచ్చిపోయాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో మార్‌క్రమ్ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదాడు. బుమ్రా వేసిన తర్వాత ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి మూడంకెల స్కోరు అందుకున్నాడు. సిరాజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి లాంగాఫ్‌లో రోహిత్‌కు చిక్కాడు. రబాడ (2)ను ప్రసిద్ధ్ కృష్ణ వెనక్కి పంపాడు. ఎంగిడి (8)ని బుమ్రాను ఔట్ చేయడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది.