IND vs SA 2nd Test :కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్, సౌతాఫ్రికా తలపడుతున్నాయి. అయితే తొలిరోజు మ్యాచ్ రసవత్తరంగా జరిగింది. ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్‌లు పూర్తై, దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ కూడా మొదలు పెట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో మొదటి రోజే 23 వికెట్లు కుప్పకూలాయి. దీంతో తొలిరోజు అత్యధిక వికెట్లు పడిన రెండో మ్యాచ్‌గా నిలిచింది. దీనిపై మాజీ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. తాను ఫ్లైట్ ఎక్కి దిగేలోపు ఏం జరిగిందని ఆశ్చర్యపోయారు.
'2024లో క్రికెట్ ఒకే రోజు 23 వికెట్లు తీయడంతో మొదలైంది. అది నమ్మశక్యంగా లేదు. నేను దక్షిణాఫ్రికా ఆలౌట్ అయినప్పుడు ఫ్లైట్ ఎక్కాను. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను. దక్షిణాఫ్రికా 3 వికెట్లు కోల్పోయినట్లు టీవీ చూపిస్తోంది. ఇంతకీ నేను ఏం మిస్ అయ్యాను' అంటూ ఫన్నీగా పోస్టు పెట్టారు మాస్టర్ బ్లాస్టర్.
IND Vs SA Test 2024 :ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఫస్ట్ సెషన్లోనే ప్రత్యర్థిని 55 పరుగులకు ఆలౌట్ చేసింది టీమ్ఇండియా. భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో విరుచుకుపడ్డాడు. కానీ బ్యాటింగ్‌లో మాత్రం భారత్ ప్రభావం చూపలేకపోయింది. 34.5 ఓవర్లలో 153 పరుగులకు కుప్పకూలింది. అయితే 153 పరుగుల వద్దే ఆరు వికెట్లు కొల్పోవడం నిరాశపరిచింది.