Ind vs Sa 2nd Test 2024:భారత్- సౌతాఫ్రితా రెండో టెస్టు తొలి రోజు ముగిసేసరికి ఆతిథ్య జట్టు 36 పరుగులు వెనకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌటైన సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 62-3తో బ్యాటింగ్ చేస్తోంది. తొలి రోజు పూర్తిగా పేసర్లకు అనుకూలించిన పిచ్‌పై ఇరుజట్ల బౌలర్లు చెలరేగిపోయారు. ఒక్క రోజే 23 వికెట్లు నేలకూల్చారంటే పిచ్ ఏ విధంగా పేసర్లకు సహకరించిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎయిడెన్ మర్క్రమ్ (36*), డేవిడ్ బెడింగమ్ (7*) క్రీజులో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బౌలర్లు ముకేశ్ కుమార్ 2, జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ దక్కించుకున్నారు.
భారత్ తొలి ఇన్నింగ్స్: తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిని ఫస్ట్ సెషన్లోనే ఆలౌట్ చేసిన టీమ్ఇండియా, బ్యాటింగ్‌లో ప్రభావం చూపలేకపోయింది. 34.5 ఓవర్లలో టీమ్ఇండియా 153 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (39 పరుగులు), యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (36), విరాట్ కోహ్లీ (46) మినహా మిగతావారెవరూ రెండంకెల స్కోర్ సాధించలేదు. ముఖ్యంగా ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (0), శ్రేయస్ అయ్యర్ (0) ఇద్దరూ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. సఫారీ పేసర్ల దెబ్బకు టీమ్ఇండియాలో మొత్తం ఆరుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. దీంతో 153 పరుగుల వద్దే భారత్ చివరి ఆరు వికెట్లు కోల్పోవడం గమనార్హం. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగ్డీ, కగిసో రబాడా, బర్గర్ తలో మూడు వికెట్లు దక్కించుకున్నారు.