IND vs SA ODI: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శుక్రవారం కీలకమైన రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. తొలి వన్డేలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుని సిరీస్ రేసులో నిలబడాలని కేఎల్ రాహుల్ నాయకత్వంలోని టీమ్‌ఇండియా భావిస్తుండగా.. వరుసగా రెండో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని సఫారీలు ఉవ్విళ్లూరుతున్నారు. తొలి వన్డేలో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శార్దూల్ ఠాకూర్ అర్ధ శతకాలతో రాణించినా భారత్‌కు ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో మ్యాచ్ గెలవాలంటే టీమ్‌ఇండియా తుది జట్టులో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్, మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు.
"భారత పేస్ దళంలో మార్పులు చేయాలి. ప్రసిధ్ కృష్ణ లేదా మహమ్మద్ సిరాజ్.. వారిద్దరిలో ఒకరు తుది జట్టులో ఉండాలి. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నారా.. లేదా భువనేశ్వర్‌ను పక్కన పెడతారా అనేది మేనేజ్‌మెంట్ ఇష్టం. సిరాజ్, ప్రసిధ్‌లలో ఎవరైనా సరే పదకొండు మందిలో ఉండాల్సిందే. వీరు జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్నా. మధ్య ఓవర్లలో తప్పకుండా వికెట్లను పడగొట్టగలరు."