IND VS SA 2nd ODI 2023 KL Rahul :దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటిన టీమ్ఇండియా రెండో మ్యాచ్‌లో తడబడింది. ఫలితంగా గబేహా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా సఫారీ బౌలర్ల ధాటికి 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది.
మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా స్టాండింగ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడాడు. ఓటమికి గల కారణాలను వివరించాడు. ''మ్యాచ్‌లో టాస్ గెలిచి ఉంటే బాగుండేది. ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం సవాలుగా ఉంది. కానీ మేం కుదురుకునే ప్రయత్నం చేశాం. మరో 50-60 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా వచ్చేది. మేం బ్యాటింగ్ ప్రారంభించినప్పుడు 240-250 మంచి స్కోరుగా భావించాం. ఓ బ్యాటర్ కుదురుకుంటే ఆ స్కోరును సాధించేవాళ్లం. కానీ కీలక సమయంలో వికెట్లు కోల్పోయాం'' అని కేఎల్ రాహుల్ తెలిపాడు.
''జాగ్రత్తగా ఆడాలా, దూకుడుగా ఆడాలా అనేది ప్లేయర్ల పర్సనల్ ప్లాన్. వారికి తగ్గట్టుగా వారు ఆడతారు. క్రికెట్‌లో రైటా రాంగా అని ఉండదు. జట్టు కోసం మన విధిని నిర్వర్తించాలి. బౌలింగ్ విషయానికొస్తే పిచ్ తొలి పది ఓవర్లకు కలిసొచ్చింది. వారిని ఇబ్బంది పెట్టాం కానీ వికెట్లు తీయలేకపోయాం. కానీ సాధించి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేది. ఏం జరిగినా ఆ విషయాన్ని మైదానంలోనే వదిలేస్తాం. తర్వాత మ్యాచ్ గురించి ఫోకస్ పెడతాం''