Ind vs Pak World Cup 2023 :2023 వరల్డ్‌కప్‌లో భాగంగా జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో పలు ఆసక్తికర సంఘటనలు జరిగాయి. దాయాదుల పోరులో జరిగిన ఈ సంఘటనలను మైదానంలో ప్రత్యక్షంగా, టీవీల్లో, ఓటీటీలో లైవ్ చూస్తున్న ప్రతీ టీమ్ఇండియా అభిమాని ఎంజాయ్ చేశాడు. ఇంతకీ ఎం జరిగిందంటే..
విరాట్ వాచ్ సీన్.. పాకిస్థాన్ ఇన్నింగ్స్ 73 వద్ద ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (36) ఔటయ్యాడు. తర్వాత మహ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. ఇక క్రీజులోకి ఎంట్రీ ఇచ్చిన రిజ్వాన్.. వచ్చి రాగానే బ్యాటింగ్ చేయాల్సి ఉంది. కానీ అతడు నాన్ స్ట్రైక్ఎండ్లో ఉన్న కెప్టెన్ బాబర్ అజామ్‌తో ఏదో ముచ్చటించాడు. సమయం గడుస్తున్నప్పటికీ.. రిజ్వాన్ మాటలు ఆపి బ్యాటింగ్‌కు సిద్ధం కాలేదు. దీంతో టీమ్ఇండియా ఆటగాళ్లకు అసహనానికి లోనయ్యారు.
ఇక చేసేదేమీలేక టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. వెంటనే ఫీల్డ్ అపైర్ను సంప్రదించాడు. జరుగుతున్న ఆలస్యంపై అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు రోహిత్. మరోవైపు అక్కడే ఫీల్డింగ్ చేస్తున్నవిరాట్ కోహ్లీ, రిజ్వాన్‌ను ఉద్దేశిస్తూ.. తన చేతికి ఉన్న బ్యాండ్‌ను వాచ్‌లాగా చూపిస్తు 'ఇంత ఆలస్యమా' అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చాడు. దీంతో విరాట్ యాక్షన్‌కు.. మద్దతుగా వెంటనే ఆడియోన్స్ కూడా గట్టిగా అరిచారు.