Ind VS Pak World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్‌జట్లు శనివారం తలపడనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో విజయం కోసం ఇరు జట్లు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. 1992 నుంచి ఇప్పటివరకు ఇరు జట్లు ఏడుసార్లు తలపడగా అన్నిసార్లూ భారత్ విజయం సాధించింది. తాజా ప్రపంచకప్‌లోనూ ఇదే జోరు కొనసాగించాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది.
బ్యాటింగ్, బౌలింగ్ పరంగా, ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు ఫేవరెట్‌గా కనిపిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, KL రాహుల్ మంచి ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసొస్తుంది. డెంగీ నుంచి కోలుకున్న శుభ్‌మన్ గిల్ ప్రాక్టీస్ చేస్తుండగా.. పాక్‌తో మ్యాచ్‌లో ఆడడంపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ శుభ్‌మన్ తుది జట్టులో లేకపోతే.. ఇషాన్ కిషన్‌కు మరో అవకాశం దక్కనుంది. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, జడేజా కూడా తమ స్థాయికి తగ్గట్టు రాణిస్తే పాకిస్థాన్‌పై భారీ స్కోర్‌కు ఢోకా ఉండదని భారత్ జట్టు అంచనా వేస్తోంది.
బౌలింగ్ విభాగంలోనూ భారత్ జట్టు పటిష్ఠంగానే కనిపిస్తోంది. స్టార్ బౌలర్ బుమ్రా మంచి ఫామ్‌లో ఉండగా స్పిన్నర్లు జడేజా, కుల్‌దీప్ యాదవ్ కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ జట్టు విజయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లలో మహ్మద్ సిరాజ్ ఎక్కువగా పరుగులు ఇవ్వడాన్ని దృష్టిలో పెట్టుకొని పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో మహ్మద్ షమీని.. తుది జట్టులోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. ఒకవేళ ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లాలని భావిస్తే శార్దూల్ ఠాకూర్ స్థానంలో అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.