తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND vs PAK: పాక్​పై భారత్ ఎందుకిలా ఓడిపోతోంది? - టీ20 ప్రపంచకప్​ 2021 భారత్​ పాక్ మ్యాచ్

భారత్‌ - పాకిస్థాన్‌ మ్యాచ్‌(T20 worldcup 2021 teamindia pakisthan match) అంటే క్రికెట్‌ మాత్రమే కాదు.. కోట్లాది మంది అభిమానులకు పండగే.. రెండు దేశాల్లో నరాలు తెగే ఉత్కంఠ. ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకునే రసవత్తర పోరు. అలాంటిది గత నాలుగేళ్లలో దాయాదితో(pak vs teamindia 2021) జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా రెండు ఓటములు చవిచూసింది. ఇది ఐసీసీ టోర్నీల్లో భారత ఆధిపత్యాన్ని నెమ్మదిగా తగ్గించేట్లు కనపడుతోంది. మొత్తంగా ఇరు దేశాల మధ్య ఆటలో పాకిస్థాన్‌దే పైచేయి అయినా.. మూడు దశాబ్దాలుగా ఐసీసీ టోర్నీల్లో మాత్రం టీమ్‌ఇండియాదే ఆధిపత్యం. అలాంటిది ఇప్పుడు ఇలా రెండు ఘోర పరాభవాలు అభిమానులను తీవ్రంగా కలచివేస్తున్నాయి. అసలు కోహ్లీసేన దారుణ వైఫల్యాలకు కారణాలేంటి..? ఇకపై గెలవాలంటే ఏం చేయాలి..? ఈ ప్రశ్నలే ఇప్పుడు అందర్నీ వెంటాడుతున్నాయి..! వాటికి సమాధానాలే ఈ కథనం..

T20 worldcup
టీ20 ప్రపంచకప్​

By

Published : Oct 26, 2021, 4:25 PM IST

Updated : Oct 27, 2021, 6:48 AM IST

టీ20 ప్రపంచకప్​లో(T20 worldcup 2021) భాగంగా జరిగిన మ్యాచ్​లో పాకిస్థాన్​పై టీమ్​ఇండియా పది వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది(pak vs teamindia 2021). మొత్తంగా గత నాలుగేళ్లలో దాయాదితో జరిగిన నాలుగు మ్యాచ్​ల్లో రెండు ఓటములను మూటగట్టుకుంది. అసలు కోహ్లీసేన దారుణ వైఫల్యాలకు కారణాలేంటి? ఇకపై గెలవాలంటే ఏం చేయాలి? వంటి విశేషాల సమాహారమే ఈ కథనం..

భారత్​-పాక్​

అక్కడ కోహ్లీదే తప్పు..

2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లోనే(2017 champions trophy final match) టీమ్‌ఇండియాకు పాకిస్థాన్‌ గట్టి షాకిచ్చింది. తొలుత లీగ్‌ స్టేజ్‌లో దాయాది జట్టు కోహ్లీసేన చేతిలో 124 పరుగుల తేడాతో ఓడిపోయినా ఫైనల్లో దిమ్మతిరిగే విజయం సాధించింది. ఫకర్‌ జమాన్‌ (114) శతకానికి తోడు మిగతా బ్యాట్స్‌మన్‌ రాణించడం వల్ల పాక్‌ 338/4 భారీ లక్ష్యాన్ని విసిరింది. లక్ష్య ఛేదనలో రోహిత్‌ శర్మ (0), ధావన్‌ (21), కెప్టెన్‌ కోహ్లీ (5)ని మహ్మద్‌ అమిర్‌ దెబ్బతీశాడు. 33 పరుగులకే మూడు వికెట్లు తీసి భారత్‌ను ఆత్మరక్షణలోకి నెట్టాడు. అనంతరం టీమ్‌ఇండియా 158 పరుగులకే కుప్పకూలి 180 పరుగుల భారీ తేడాతో చిత్తయింది. ఆరోజు టాస్‌ గెలిచినా కోహ్లీ బ్యాటింగ్‌కు(champions trophy 2017 virat kohli score) అనుకూలించే పిచ్‌పై ఫీల్డింగ్‌ ఎంచుకోవడమే అతిపెద్ద తప్పు. ఈ మ్యాచ్‌ జరిగింది లండన్‌లోని ఓవల్‌ మైదానంలో. తొలుత పిచ్‌ పేసర్లకు కఠినంగా ఉన్నా రెండో ఇన్నింగ్స్‌లో పూర్తిగా మారిపోయింది. దీంతో పాక్‌ పేసర్లు రెచ్చిపోయి బౌలింగ్‌ చేశారు. ఈ విజయం ద్వారా ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో పాక్‌ ఆధిపత్యం 3-2కి చేరింది.

2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ

ఇక్కడ సర్ఫరాజ్‌ తప్పు..

ఇక 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌(2019 world cup pak vs india) మరోసారి తలపడ్డాయి. ఈసారి పాకిస్థాన్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. టీమ్‌ఇండియా ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (57), రోహిత్‌ శర్మ (140), విరాట్‌ కోహ్లీ (77) దంచికొట్టడం వల్ల భారత్‌ 336/5 భారీ స్కోర్‌ చేసింది. అనంతరం పాక్‌ లక్ష్య ఛేదనలో వర్షం అంతరాయం కలిగించగా మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. ఆ మ్యాచ్‌లో పాక్‌ 212/6 స్కోర్‌కే పరిమితం అయింది. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతిలో 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది కూడా ఇంగ్లాండ్‌లోనే మాంచెస్టర్‌ మైదానంలో జరిగింది. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో కోహ్లీ చేసిన తప్పే ఈసారి పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ చేశాడు(pak vs india 2019 world cup match). బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై టాస్‌ గెలిచిన వెంటనే బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో అప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న టీమ్‌ఇండియా టాప్‌ ఆర్డర్‌ అద్భుతంగా రాణించింది. చివరికి ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత్‌ పాక్‌పై 12-0 ఆధిక్యం సాధించింది.

2019వన్డే ప్రపంచకప్‌

ఈసారి ఫలించిన వ్యూహం..

ఇక ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌(T20 worldcup 2021 teamindia pakisthan match) టాస్‌ గెలవగానే మరో ఆలోచన లేకుండా బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దుబాయ్‌ వేదిక గురించి అతడికి పూర్తి అవగాహన ఉండటం వల్ల ఆ నిర్ణయం తీసుకున్నాడు. మ్యాచ్ ప్రారంభమైన ఆరు ఓవర్లకే టీమ్‌ఇండియా మూడు ప్రధాన వికెట్లు కోల్పోవడం వల్ల బాబర్‌ నిర్ణయం సరైందని తేలింది. షహీన్‌ అఫ్రిది బౌలింగ్‌లో రోహిత్(0), రాహుల్‌(3) ఔటవ్వగా.. సూర్యకుమార్‌(11)ను హసన్‌ అలీ పెవిలియన్‌కు పంపాడు. దీంతో భారత్‌ 31 పరుగులకే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలోకి జారుకొంది. ఆ తర్వాత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (57), రిషభ్‌ పంత్‌(39) వికెట్లు పడకుండా అడ్డుకొన్నా.. ధాటిగా షాట్లు ఆడలేకపోయారు. పాక్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం వల్ల చివరికి టీమ్‌ఇండియా 151/7 స్కోర్‌ సాధించింది. ఈ క్రమంలోనే ఆ జట్టు ఓపెనర్లు రిజ్వాన్‌ (79), బాబర్‌ (68) ఒక్క వికెట్‌ కోల్పోకుండా లక్ష్యాన్ని పూర్తి చేశారు. దీంతో ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత్‌పై (12-1) తొలి విజయాన్ని(teamindia pakisthan match 2021) సాధించి చరిత్ర సృష్టించారు.

2021 టీ20 ప్రపంచకప్​

ఇవీ అసలు కారణాలు..

టాస్‌లే కీలకం: ఈ రెండు మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా ఓటములకు టాస్‌ కూడా ఓ కారణం అని చెప్పొచ్చు. కోహ్లీ ఈ మ్యాచ్‌లో టాస్‌గెలిచి ఉంటే కచ్చితంగా బౌలింగే ఎంచుకునేవాడు. ఎందుకంటే లక్ష్య ఛేదనలో మంచు ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఏ జట్టు అయినా దుబాయ్‌లో ఆ నిర్ణయమే తీసుకుంటుంది. అయితే, 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో అతడి నిర్ణయం కచ్చితంగా తప్పేనని నిపుణుల భావన. అది బ్యాటింగ్‌ పిచ్‌ అయినా తొలుత బౌలింగ్‌ తీసుకోవడం పై విమర్శలొచ్చాయి.

భారీ అంచనాలతో ఒత్తిడి: కొంతకాలంగా టీమ్‌ఇండియా ఎంత బాగా రాణిస్తున్నా ఏదో ఒక సందర్భంలో ఘోరంగా చతికిల పడుతోంది. ప్రతి మెగా టోర్నీలో ఫేవరెట్‌ జట్టుగా బరిలోకి దిగడం, భారీ అంచనాల నడుమ కీలక మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వడం పరిపాటిగా మారింది. ఇది గత ఆరేళ్లుగా ఇలాగే జరుగుతోంది. అందుకు నిదర్శనమే.. 2015 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌, 2016 టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌, 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌, 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌, 2021 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు. మరోవైపు పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే టీమ్‌ఇండియాపై భారీ అంచనాలు ఉంటున్నాయి. దీంతో ఒత్తిడి తట్టుకోలేక టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ విఫలమవుతున్నారు.

బలహీనతలు: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఏ మ్యాచ్‌నూ తాము తేలిగ్గా తీసుకోమని చెబుతున్నా వాస్తవంగా పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. భారత టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ బలహీనతలపై ప్రత్యర్థులు దృష్టిసారించి కీలక మ్యాచ్‌ల్లో సరైన ఫలితాలు రాబడుతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌ సైతం అదే వ్యూహాన్ని రచించి 2017లో అమీర్‌తో, ఇప్పుడు షహీన్‌తో తమకు కావాలసిన వికెట్లను దక్కించుకుంది.

తేలిక భావం: పేపర్‌ మీద టీమ్‌ఇండియా అంత బలమైన జట్టు ప్రస్తుతం ఎక్కడా లేదు. అయినా కోహ్లీసేన ఇలా ఊహించని విధంగా చతికిలపడుతోంది. జట్టు నిండా ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే విన్నర్లున్నా.. ఒత్తిడికి చిత్తవుతున్నారు. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేసి బరిలోకి దిగడం వల్ల ఈ పరిస్థితి నెలకొంటోందనే విమర్శలున్నాయి. గత కొన్నేళ్లుగా ఇదే తరచూ పునరావృతం అవుతోంది.

పాక్‌ పకడ్బందీగా: మరోవైపు పాకిస్థాన్‌ ఇంతకుముందులా లేదనేది కాదనలేని వాస్తవం. ముఖ్యంగా గతనెలలో న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ జట్లు పాకిస్థాన్‌ పర్యటనలను రద్దు చేసుకోవడం కూడా ప్రధాన కారణం. గొప్ప జట్లుగా పేరున్న వాటికి తమ ఆటతోనే బదులివ్వాలనే నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే తాము తక్కువేమీ కాదని నిరూపించుకునే పనిలో నిమగ్నమైంది. దీంతో పకడ్బందీ ప్రణాళికతో ప్రపంచకప్‌లో అడుగుపెట్టి భారత్‌కు షాకిచ్చింది. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో రాణించి కోహ్లీసేనకు పీడకల మిగిల్చింది.

కోహ్లీ, బాబర్​

నోట్‌: పైన పేర్కొన్న కారణాలన్నీ టీమ్‌ఇండియా ఓటములకు పలు కారణాలుగా కనిపిస్తున్నా పాకిస్థాన్‌ను సరైన రీతిలో ఎదుర్కోలేకపోవడమే కోహ్లీసేన చేసిన అతి పెద్ద తప్పు. ఆ జట్టు ఇటీవల ఎలా ఆడుతోంది.? అందులో కీలక ఆటగాళ్లు ఎవరు? బౌలర్లు ఎలా రాణిస్తున్నారు.? వారిని ఎలా ఎదుర్కోవాలి.? 2017లో నాటి పరిస్థితులే ఇప్పుడూ ఎదురైతే ఏం చేయాలి? మన బౌలర్లు ఎలా రాణించాలి? అనే విషయాలపై దృష్టి సారించలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇక నుంచి పాకిస్థాన్‌పై విజయం సాధించాలంటే అన్ని విభాగాల్లో రాణించాలి. ఆటలో గెలుపోటములు సహజమే అయినా మరీ ఇంత దారుణంగా 10 వికెట్ల తేడాతో ఓడిపోవడమే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చివరగా భారత్‌ ఇకపై అన్ని మ్యాచ్‌లు గెలుపొంది ఫైనల్లో పాకిస్థాన్‌తో మరోసారి తలపడాలని, అప్పుడు టీమ్‌ఇండియా గెలవాలని సగటు అభిమాని ఆశిస్తున్నాడు. అదే జరగాలని మనమూ కోరుకుందాం. ఆల్‌ ది బెస్ట్‌ టీమ్‌ఇండియా..!

టీమ్​ఇండియాతో పాక్​ కెప్టెన్​ బాబర్​

ఇదీ చూడండి: IND vs PAK: భారత్‌ ఓటమికి కారణాలు చెప్పిన సచిన్‌

Last Updated : Oct 27, 2021, 6:48 AM IST

ABOUT THE AUTHOR

...view details