Ind vs Pak Final 2023 : ఎమర్జింగ్ ఆసియా కప్ 2023కొలంబో వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్థాన్ ఏ పై 128 పరుగుల తేడాతో ఓడింది భారత్ ఏ. 353 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్.. 224 పరుగులకే ఆలౌటైంది. టీమ్ఇండియా బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్ల ధాటికి ఎదురు నిలబడలేకపోయారు. కాగా ఈ మ్యాచ్‌లో శతకంతో మెరిసిన తాహిర్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించగా.. టీమ్ఇండియా ఆల్‌రౌండర్ నిషాంత్ సింధుకు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' దక్కింది. ఇక ఈ విజయంతో పాకిస్థాన్ ఏ ట్రోఫీని ముద్దాడగా.. యువ భారత జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
ఆరంభం అదిరినా..
భారీ లక్ష్య ఛేదనను భారత్ ఘనంగానే ఆరంభించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (61), సాయి సుదర్శన్ (29) దూకుడుగానే ఆడారు. కానీ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో సుదర్శన్‌ను అర్షద్ ఔట్ చేశాడు. అయినప్పటికీ మరో ఓపెనర్ అభిషేక్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 20 ఓవర్లు ముగిసేసరికి భారత్ 132/3తో నిలిచింది. రన్‌రేట్ మెరుగ్గా ఉండటం వల్ల భారత్ గెలుపుపై అందరికీ ధీమా ఉంది.
అప్పటి వరకూ విజయావకాశాలు కూడా ఇరుజట్లకు సమాన స్థాయిలోనే ఉన్నాయి. కానీ అప్పటి నుంచి భారత్ ఇన్నింగ్స్ గాడీ తప్పింది. క్రమం తప్పకుండా వికెట్లు పారేసుకుంది. కెప్టెన్ యశ్ ధుల్ (39) ఫర్వాలేదనిపించినా.. మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమయ్యింది. బ్యాటర్లు ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరారు. భారత్ 67 పరుగుల వ్యవధిలోనే చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. కాగా పాకిస్థాన్ బౌలర్లలో ముఖీమ్ 3, ముంతాజ్ 2, అర్షద్ 2, వసీమ్ 2, ముభాషిర్ ఖాన్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై పాక్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఓపెనర్లిద్దరూ అర్ధశతకాలతో మెరవగా.. నాలుగో వికెట్లో వచ్చిన తాహిర్ (108) సెంచరీ బాదాడు. టీమ్ఇండియా బౌలర్లలెవరూ ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి తీసుకురాలేకపోయారు. దీంతో పాక్.. భారత్ ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది. కాగా భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 2, హంగార్గేకర్ 2, సుతార్, హర్షిత్ రానా, నిషాంత్ సింధు తలో వికెట్ తీశారు.