Ind vs Pak Bilateral Series:అంతర్జాతీయ క్రికెట్లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్కు ఉండే క్రేజ్ వేరు. దాయాదుల మధ్య మ్యాచ్ ఉందంటే, యావత్ క్రీడాలోకం టీవీలకు అతుక్కుపోతుంది. ఈ సమయంలో టీఆర్పీ రేటింగ్స్ (TRP Ratings) కూడా ఎక్కువే. అయితే టెర్రర్ అటాక్ల కారణంగా 2012 తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు పూర్తిగా రద్దయ్యాయి. టీమ్ఇండియా సైతం పాక్ గడ్డపై క్రికెట్ ఆడడాన్ని భారత ప్రభుత్వం నిషేధించింది.
అప్పటినుంచి భారత్- పాకిస్థాన్ మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు లేవు. ఇరుజట్లు కేవలం ఐసీసీ ఈవెంట్ (టీ20, వన్డే వరల్డ్కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్)లోనే పోటీ పడతున్నాయి. అయితే ప్రస్తుత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ జాకా అష్రఫ్, భారత్- పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు పునః ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆయన రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
'నేను రీసెంట్గా బీసీసీఐ సెక్రటరీ జై షాను కలిశా. ఇండోపాక్ మధ్య ఎప్పటిలాగే ద్వైపాక్షిక సిరీస్లు రీ స్టార్ట్ చేద్దామని చెప్పాను. దీనికి షా సానుకూలంగా స్పందించారు. దానికి వారు భారత ప్రభుత్వం అనుమతి పొందాల్సి ఉంటుందని షా అన్నారు. భారత్లో లోక్సభ ఎన్నికల తర్వాత ఈ విషయంపై ఓ స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని మేం ఆశిస్తున్నాం' అని అష్రఫ్ అన్నారు. ఇదే విషయంపై గతంలో భారత క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదం, అక్రమ చొరబాట్లు ఆపేంత వరకు ఇండోపాక్ మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు ఉండవని తేల్చి చెప్పారు.