Ind Vs Pak Asia Cup 2023 :భారత్ - పాక్ మ్యాచ్ అంటే క్రికెటర్లకు ఎంత టెన్షన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యర్థి జట్టుపై తమ దేశం ఆటగాళ్లు ఆధిపత్యం చలాయించి విజయం సాధించాలంటూ ఇరుజట్ల అభిమానులు ఎంతగానో కోరుకుంటారు. కానీ, కొన్నిసార్లు ఫలితం ఎటూ తేలకుండాపోయి అభిమానులకు చివరికి నిరాశే మిగులుతుంది. శనివారం జరిగిన ఆసియా కప్ 2023 టోర్నీలోనూ సరిగ్గా ఇలానే జరిగింది. శ్రీలంక వేదికగా ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు వర్షం కారణంగా రద్దైంది. రెండుసార్లు వర్షం అంతరాయాల నడుమ టీమ్‌ఇండియా 48.5 ఓవర్లకు 266 పరుగులు చేసి ఆలౌటవ్వగా.. ఆ తర్వాత ఎడతెరిపి లేని వర్షం కురవడం వల్ల పాక్ ఇన్నింగ్స్ ప్రారంభం కాకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. అయితే ఇలాంటి ఘటనలు ఆసియా కప్‌లో చాలానే జరిగాయి. అది ఎప్పుడంటే..
అప్పుడు అలా..
Asia Cup 2023 : ఇప్పటి వరకు ఆసియా కప్‌లో భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య వన్డే ఫార్మాట్‌లో 17 మ్యాచ్‌లు జరగ్గా.. అందులో 1997 ఆసియా కప్‌లో తప్ప మిగతావన్నీ ఫలితాలు వచ్చినవే. ఇది కూడా శ్రీలంక వేదికగా జరిగిన మ్యాచ్ కావడం విశేషం. తొలుత జులై 20న భారత్ - పాక్ మ్యాచ్ ప్రారంభమైంది.
పాక్ బ్యాటింగ్ చేస్తూ 9 ఓవర్లలోనే ఐదు వికెట్ల నష్టానికి 30 పరుగులు మాత్రమే చేసింది. ఆ సమయంలో వర్షం రావడం వల్ల మ్యాచ్ మరుసటి రోజుకు వాయిదాపడింది. అయితే, అప్పుడు కూడా వర్షం తగ్గకపోగా.. మ్యాచ్‌ను రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. ఆ మ్యాచ్‌లో వెంకటేశ్ ప్రసాద్ (4/17), అబే కురువిల్లా (1/10) ధాటికి సయీద్ అన్వర్ (0), ఇంజమామ్ ఉల్ హక్ (0) డకౌట్‌గా వెనుదిరిగారు.