Ind vs Pak Asia Cup 2023 :ప్రతిష్ఠాత్మకమైన ఆసియా కప్‌లో భాగంగా శనివారం భారత్ పాకిస్థాన్ పోరులో టీమ్ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులు చేసి ఆలౌటైంది. హార్డ్ హిట్టర్ హార్దిక్ పాండ్య (87 పరుగులు: 89 బంతుల్లో; 7x4, 1x6), యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ (82 పరుగులు: 81 బంతుల్లో; 9x4, 2x6) హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. ఇక పాకిస్థాన్ బౌలర్లలో షహీన్ అఫ్రిదీ 4, హారిస్ రౌఫ్ 3, నసీమ్ షా 3 వికెట్లు పడగొట్టారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఘనమైన ఆరంభమేమీ దక్కలేదు. పాక్ బౌలర్ షహీన్ అఫ్రిది నిప్పులు చెరిగాడు. పదునైన పేస్ బౌలింగ్‌తో కెప్టెన్ రోహిత్(11), స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(4) ని క్లీన్‌బౌల్డ్ చేసి భారత్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఇక సుదీర్ఘ విరామం తర్వాత.. జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్ వచ్చీ రాగానే రెండు ఫోర్లు కొట్టి ఊపుమీద కనిపించాడు. కానీ అయ్యర్ (14)ను హారిస్ రౌఫ్ వెనక్కిపంపాడు. కొద్దిసేపటికే శుభ్‌మన్ గిల్ (10) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 14.1 ఓవర్లకు 66-4తో కష్టాల్లో పడింది.