Ind Vs Pak Asia Cup 2023 :పాకిస్థాన్ బౌలర్ షహీన్ అఫ్రిదిని భారత బ్యాటర్లు ఎదుర్కోగలరా? పాక్‌తో మ్యాచ్ ముంగిట అందరిలో తలెత్తిన ప్రశ్న ఇదే. మ్యాచ్‌కు ముందు రోజు జరిగిన విలేకరుల సమావేశంలోనూ టీమ్ఇండియా కెప్టెన్రోహిత్ శర్మకు ఇదే ప్రశ్న ఎదురైంది. అయితే షహీన్‌తో పాటు మిగతా పాక్ పేసర్లను ఎదుర్కోగల అనుభవం తమ జట్టుకు ఉందంటూ రోహిత్ ధీమా వ్యక్తం చేశాడు. కానీ మ్యాచ్‌లో ఆ అనుభవం అక్కరకు రాలేదు. జట్టులో మేటి ప్లేయర్లైన కోహ్లి, రోహిత్ కూడా షహీన్ ముందు నిలవలేకపోయారు. బౌల్డ్ అయి నిరాశతో వెనుదిరిగారు. ఇక మిగతా బ్యాటర్లకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. షహీన్‌ను ఎదుర్కోవడం వారందరికీ శక్తికి మించిన పనే అయింది.
మరోవైపు ప్రపంచకప్‌నకు ఇంకో నెల రోజుల సమయమే ఉంది. ఈ సమయానికి జట్టు పూర్తి సన్నద్ధతతో, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. కానీ మెయిన్ బ్యాటర్స్ ఎవరూ ఉత్తమ ఫామ్‌లో కనిపించడం లేదు. జట్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లి, రోహిత్‌లు కూడా నిలకడగా ఆడట్లేదు. పాక్‌తో కీలక పోరులో వీళ్లిద్దరూ ఇలా విఫలమవడం క్రికెట్ అభిమానులను ఆందోళన రేకెత్తించింది.
ఇక ఐపీఎల్‌తో పాటు, అంతకుముందు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారించిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా క్రీజులో వచ్చే సమయానికి ఉన్నట్లుండి లయ కోల్పోయాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో, వెస్టిండీస్ పర్యటనలో నిరాశ పరిచిన ఈ స్టార్ ప్లేయర్.. ఇప్పుడు పాక్‌తో మ్యాచ్‌లోనూ తేలిపోయాడు. ఇక పునరాగమనంలో శ్రేయస్ సత్తా చాటుతాడు అని అందరూ అనుకుంటుంటే.. అతడి జోరు కూడా రెండు షాట్లకు పరిమితం అయింది.