Ind Vs NZ World Cup : 2023 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రోహిత్ సేన ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. వరుస విజయాలను తమ ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్లో ఉన్న టీమ్ఇండియా ఆదివారం (అక్టోబర్ 22న) న్యూజిలాండ్‌తో తలపడనుంది. అయితే అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న కివీస్‌ను ఎదుర్కోవడం భారత్‌కు కొద్దిగ సవాలుతో కూడుకున్న పనే. అయితే కొంతకాలంగా ఐసీసీ టోర్నీల్లో టీమ్‌ఇండియాపై న్యూజిలాండ్ ఆధిపత్యం చలాయించడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. 2019 ప్రపంచకప్ సెమీస్‌లో కివీస్.. భారత్‌కు షాకిచ్చిన విషయాన్ని క్రికెట్ లవర్స్ ఎవరూ అంత సులువుగా మర్చిపోలేరు. రానున్న మ్యాచ్ నేపథ్యంలో ఈ రెండు జట్ల బలబాలాలు, కొన్నేళ్లుగా భారత్‌పై కివీస్ ఎలా ఆధిపత్యం చలాయించిందో ఓ లుక్కేద్దాం.
World Cup 2023 Team India: వరుస విజయాలతో టీమ్‌ఇండియా బలంగానే ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా మన ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అదరగొడుతున్నారు. ముఖ్యంగా టాప్ ఆర్డర్‌లో రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఇటీవలే అఫ్గాన్‌పై సెంచరీ చేసిన హిట్‌మ్యాన్.. పాక్‌పై కూడా భారీ ఇన్నింగ్స్‌ను ఆడాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అర్ధ శతకం సాధించాడు.
మరోవైపు కోహ్లీ.. పాక్ మ్యాచ్ మినహా మిగతా అన్ని మ్యాచ్‌ల్లో రాణించాడు. బంగ్లాదేశ్‌పై ఓ సెంచరీ కూడా బాదాడు. ఇక కేఎల్ రాహుల్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు స్కోర్ విలువైన స్కోర్ అందిస్తున్నాడు. రానున్న మ్యాచ్‌లో ఈ ముగ్గురు మొనగాళ్లు రాణిస్తే ఇక కివీస్ బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. గిల్, శ్రేయస్ కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికీ.. ఆడినంతలో వారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేశారు. ఈ క్రమంలో వీరు కూడా టాప్‌గేర్‌లోకి వస్తే భారత్ బ్యాటింగ్‌కు ఇక తిరుగుండదు.
లోయర్ ఆర్డర్‌లో జడేజా ఎలాగూ ఉండనే ఉన్నాడు. గాయం కారణంగా హార్దిక్ కివీస్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవడం అనేది భారత్‌కు ప్రతికూలాంశంగా మారింది. ఇక, బౌలింగ్‌లో బుమ్రా,కుల్‌దీప్,జడేజా యాదవ్ ప్రత్యర్థి జట్టును కట్టడి చేస్తున్నారు. కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ సిరాజ్ జట్టు విజయాల్లో తన వంతు పాత్రను పోషిస్తున్నాడు. ఇవన్ని దృష్టిలో ఉంచుకుని టీమ్ఇండియా సమష్టిగా రాణిస్తే ఇక కివీస్‌ను చిత్తు చేయడం కష్టతరమైన పనేమి కాదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
ఆ జోరుకు అడ్డు కట్ట వేసేనా?
2015, 2019లో వరుసగా రెండుసార్లు ఫైనల్‌కు చేరినప్పటికీ.. న్యూజిలాండ్ తన కప్ కలను సాకారం చేసుకోలేకపోయింది. దీంతో ఈ ప్రపంచకప్‌లోనైనా ఆ లోటును తీర్చుకోవాలని కివీస్ కసిగా ఉంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి మంచి జోష్ మీదుంది. విల్ యంగ్, డేవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, లాథమ్, ఫిలిప్స్‌లతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్‌గా ఉంది. వీరంతా కూడా మంచి ఫామ్‌లో ఉన్న ప్లేయర్లే.
చాప్‌మన్, మిచెల్ శాంట్నర్ కూడా తమ ఇన్నింగ్స్‌తో మెరుపులు మెరిపిస్తున్నారు. రచిన్ రవీంద్ర, కాన్వే ఇప్పటికే సెంచరీలు బాదారు. విల్ యంగ్, ఫిలిప్స్, డారిల్ మిచెల్ కూడా భారీ ఇన్నింగ్స్‌లు ఆడారు. బౌలింగ్‌లో మ్యాట్ హెన్రీ, శాంట్నర్, ఫెర్గూసన్ అదరగొడుతున్నారు. ప్రస్తుతం శాంట్నర్ 11 వికెట్లతో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. అయితే ట్రెంట్ బౌల్ట్ ఎక్కువగా వికెట్లు పడగొట్టకపోయినప్పటికీ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు.
కివీస్‌తో మన భారత్..
2003 ప్రపంచకప్‌లో సౌరభ్ గంగూలీ నాయకత్వంలోని భారత జట్టు.. కివీస్‌ను ఓడించింది. తొలుత న్యూజిలాండ్‌ను 146కే ఆలౌట్ చేసిన టీమ్ఇండియా.. ఈ లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 56 బంతులు మిగిలుండగానే ఛేదించింది. అలా ఐసీసీ టోర్నీల్లో కివీస్‌పై భారత్‌కిదే ఆఖరి విజయం. తర్వాత జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో మన జట్టుకు ఓటమి తప్పలేదు.