Ind Vs Nz World cup 2023 :2023 వరల్డ్‌కప్‌లో భాగంగా ధర్మశాల వేదికగా భారత్ - న్యూజిలాండ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. బ్యాటింగ్‌లో కివీస్ తొలుత తడబడ్డా.. తర్వాత పుంజుకుంది. సరిగ్గా 50 ఓవర్లలో 273 పరుగులు చేసి ఆలౌటైంది. డ్యారీ మిచెల్ (130 పరుగులు) శతకంతో అదరగొట్టగా.. రాచిన్ రవీంద్ర (75 పరుగులు) రాణించాడు. దీంతో కివీస్ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. టీమ్ఇండియా బౌలర్లలో మహ్మద్ షమీ 5, కుల్దీప్ యాదవ్ 2, మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బూమ్రా తలో వికెట్ పడగొట్టారు.
తడబడి లేచిన కివీస్... ఇన్నింగ్స్ ప్రారంభంలో కివీస్ బ్యాటర్లు తడబడ్డారు. భారత బౌలర్ల ధాటికి ఓపెనర్ డేవన్ కాన్వే (0) పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అతడ్ని మహ్మద్ సిరాజ్ వెనక్కిపంపాడు. తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ విల్ యంగ్ (17)ను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో కివీస్ 19 పరుగులకే ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది. ఈ క్రమంలో బ్యాటర్లు రాచిన్ రవీంద్ర, డ్యారీ మిచెల్ ఆచితూచి ఆడారు. అనవసర షాట్లకు పోకుండా క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరూ హాప్ సెంచరీలు పూర్తి చేసుకొని.. సెంచరీ వైపు అడుగులు వేశారు. కానీ, రాచిన్ 75 పరగుల వ్యక్తిగత స్కోర్ వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాట్ఔట్ అయ్యాడు. దీంతో 159 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది.
శతక్కొట్టిన మిచెల్.. రాటిన ఔటైన తర్వాత కూడా మిచెల్ నిలకడగానే ఆడాడు. మరో ఎండ్‌తో అతడికి మద్దతు కరవైనా.. స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. బౌండరీలు బాదుతూ టీమ్ఇండియా బౌలర్లను ఎటాక్ చేశాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ తర్వాత మిచెల్ జోరందుకున్నాడు. ఇక ఆఖరి ఓవర్లో షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మిగతా బ్యాటర్లెవరూ రాణించలేదు. గ్లెన్ ఫిలిప్స్ (23) ఫర్వాలేదనిపించాడు.