Ind vs Nz World Cup 2023 :2023 వరల్డ్‌కప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. అక్టోబర్ 22 ఆదివారం మెగాటోర్నీలో భాగంగా ధర్శశాల వేదికగా జరిగిన భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్‌లో.. టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. కివీస్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి.. మరో 12 బంతులుండగానే ఛేదించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (95) త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (46) రవీంద్ర జడేజా (39) శ్రేయస్ అయ్యర్ (33) రాణించారు. కివీస్ బౌలర్లలో ఫెర్గ్యూసన్ 2, మిచెల్ శాంట్నర్, మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బోల్ట్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు వికెట్లతో రాణించిన భారత బౌలర్ మహ్మద్ షమీకి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
ఆరంభం అదుర్స్.. 274 పరుగుల లక్ష్య ఛేదనను టీమ్ఇండియా ఘనంగా ఆరంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (46 పరుగులు: 40 బంతుల్లో, 4x4, 4x6) జెట్ స్పాడ్తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. మరోవైపు అతడికి శుభ్‌మన్ గిల్ (26 పరుగులు: 31 బంతుల్లో, 5x4) నుంచి కూడా కొంత సహకారం లభించింది. రోహిత్ శర్మ.. ప్రత్యర్థి బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతడు సాధించిన 46 పరుగుల్లో 40 పరుగులు బౌండరీల ద్వారా వచ్చినవే. కానీ, ఫెర్గ్యూసన్ వేసిన బంతి.. ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని వికెట్లను తాకింది. దీంతో 71 పరుగుల వద్ద టీమ్ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ ఔటైన తర్వాత గిల్ కూడా తొందరగానే క్రీజును వీడాడు.
రాణించిన మిడిలార్డర్..వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన టీమ్ఇండియాను బ్యాటర్లు విరాట్, అయ్యర్ ఆదుకున్నారు. వీరిద్దరూ 52 పరుగుల పార్ట్నర్షిప్ చేశారు. వేగంగా ఆడే క్రమంలో 21.3 ఓవర్ వద్ద అయ్యర్ ఔటయ్యాడు. తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ కూడా కాసేపు నిలకడగా ఆడాడు. అతడు కూడా విరాట్‌తో కలిసి 52 భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ శాంట్నర్ వేసిన బంతిని అంచనా వేయలేక రాహుల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగాల్సి వచ్చింది.
రాహుల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (2).. విరాట్‌తో సమన్వయం కోల్పోయి రనౌటయ్యాడు. దీంతో భారత్ 191 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన జడేజా.. కివీస్ బౌలర్లకు మరో ఛాన్స్ ఇవ్వలేదు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ టీమ్ఇండియాను విజయం వైపు నడిపించారు. భారత్ విజయం దాదాపు ఖరారైన సమయంలో విరాట్ సెంచరీకి చేరువయ్యాడు. కానీ, భారీ షాట్‌కు ప్రయత్నించి 5 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. ఇక మిగిలిన పనిని జడేజా పూర్తి చేసి.. టీమ్ఇండియాకు విజయం కట్టబెట్టాడు.