కాన్పూర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఐదో రోజు ఆటముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
రెండో ఇన్నింగ్స్‌లో 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నాలుగో రోజు ఆటముగిసే సమయానికి ఓ వికెట్ కోల్పోయి 4 పరుగులు చేసింది. ఐదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్‌కు శుభారంభమే దక్కింది. లాథమ్, సోమర్విల్లే భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న లాథమ్ (52)ను అశ్విన్ బౌల్డ్ చేశాడు. ఇక నైట్ వాచ్‌మెన్‌గా వచ్చిన సోమర్విల్లే (36)ను ఉమేశ్ పెవిలియన్ చేర్చాడు. తర్వాత టేలర్ (2), నికోలస్ (1), విలియమ్సన్ (24) వెంటవెంటనే ఔట్ కావడం వల్ల భారత శిబిరంలో విజయావకాశాలపై ఆశలు చిగురించాయి. కానీ చివర్లో రచిన్ రవీంద్ర, జేమిసన్ భారత బౌలర్లపై ఆధిపత్యం వహించారు. పరుగులు సాధించలేకపోయినా డిఫెన్స్‌తో బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు.