గత కొద్ది రోజులుగా సచిన్xకోహ్లీ ఎవరు గొప్ప అనే ప్రస్తావన ఎక్కువ వస్తోంది. అయితే తాజాగా ఈ విషయమై స్పందించాడు భీకర ఫామ్‌లో ఉన్న యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్. ''ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. ఒకరిని క్రికెట్ ఆఫ్ గాడ్‌గా పరిగణిస్తే.. మరొకరిని నా గురువుగా భావిస్తా. అలాంటిది ఇద్దరిలో ఎవరిని సూపర్‌స్టార్‌గా ఎంచుకుంటానని చెప్పడం కష్టమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నా ఓటు కింగ్ విరాట్ కోహ్లికే. దీనికి నా దగ్గర సమాధానం ఉంది. సచిన్ సార్ క్రికెట్‌లో ఉన్నప్పుడు ఆట గురించి పెద్దగా తెలియదు. మా నాన్న ఆయనకు పెద్ద అభిమాని. నాన్న నోటి నుంచే తొలిసారి సచిన్ పేరు విన్నాను. అప్పటినుంచి క్రికెట్‌ను ప్రేమిస్తూ వచ్చాను. సచిన్‌ను క్రికెట్ దేవుడిగానే చూశాను. ఆయన ఆటకు వీడ్కోలు పలికే సమయానికి ఇంకా నేను క్రికెట్ నేర్చుకునే దశలోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో కోహ్లీని నా ఆరాధ్య క్రికెటర్‌గా భావిస్తున్నా. ఒక బ్యాటర్‌గా అతడి నుంచి ఎన్నో విలువైన సలహాలు తీసుకున్నా. కోహ్లీ భయ్యాతో కలిసి బ్యాటింగ్ చేయడమే నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా'' అని అన్నాడు.
కాగా, శుభమన్ గిల్ ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. గత కొద్ది రోజులుగా సెంచరీల మీద సెంచరీలు బాదుతూ చెలరేగిపోతున్నాడు. గత నాలుగు వన్డేల్లో ఓ ద్విశతకం, రెండు శతకాలు బాది విధ్వంసం సృష్టించాడు. తాజాగా మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలోనూ శతకంతో మెరిశాడు. ఈ సిరీస్‌లో గిల్‌కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. ఇక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు.