Ind vs Nz Semi Final 2023 :2023 వరల్డ్‌కప్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌పై 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 398 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్.. 48.5 ఓవర్లలో 327 పరుగులకు చేతులెత్తేసింది. డారిల్ మిచెల్ (138 పరుగులు), కెప్టెన్ విలియమ్సన్ (69), గ్లెన్ ఫిలిప్స్ (41) రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో మహ్మద్ షమి 7, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. 7 వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించిన మహ్మద్ షమీకి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో భారత్ మెగాటోర్నీ హిస్టరీలో నాలుగోసారి ఫైనల్‌కు చేరింది.
భారీ లక్ష్యాన్ని కివీస్ ముంగిట ఉంచగానే.. ప్రత్యర్థి ఓటమి దాదాపు ఖాయమని అనుకున్నారు టీమ్ఇండియా ఫ్యాన్స్. కానీ, జరిగింది వేరు. కివీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు డేవన్ కాన్వే (13), రచిన్ రవీంద్ర (13) త్వరగానే ఔటనప్పటికీ.. డారిల్ మిచెల్, విలియమ్సన్ పట్టవదలకుండా పోరాడారు. వీళ్లిద్దరూ క్రీజులో ఉన్నంతసేపు.. టీమ్ఇండియా ఆటగాళ్లతోపాటు, ఫ్యాన్స్ మొహంలో నవ్వు లేదు. వీరిద్దరూ టీమ్ఇండియా బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ బౌండరీలే లక్ష్యంగా ఆడారు. ఒక దశలో భారత్ అభిమానుల్ని ఆందోళనకు గురిచేశారు. 3 వికెట్‌కు వీరు 181 పరుగులు జోడించారు.
షమీ షో..టీమ్ఇండియా బౌలింగ్‌లో షమీ హీరోగా నిలిచాడు. ఓకే ఓవర్లో విలియమ్సన్, టామ్ లాథమ్ (0) వికెట్ తీసి భారత్‌ను మళ్లీ గేమ్‌లోకి తీసుకొచ్చాడు. తర్వాత ఫిలిప్స్ కాసేపు పోరాడినా.. అతడ్ని బుమ్రా వెనక్కిపంపాడు. ఆ తర్వాత కివీస్ టపటపా వికెట్లు కోల్పోయింది.