Ind vs Ireland Series:2 మ్యాచ్‌ల టీ-20 సిరీస్ కోసం ఇప్పటికే ఐర్లాండ్ వెళ్లింది టీమ్ ఇండియా. పసికూనతో సిరీస్ కోసం హార్దిక్ పాండ్య.. భారత్‌కు నేతృత్వం వహిస్తున్నాడు. వీవీయస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరూ టీమ్ఇండియాకు కెప్టెన్, కోచ్‌గా చేయనుండటం ఇదే తొలిసారి. దాదాపు ఇది భారత జూనియర్ జట్టే. రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ ఇండియా సీనియర్ టీమ్ ఇంగ్లాండ్‌తో సిరీస్ కోసం వెళ్లింది. అయినా ఐర్లాండ్‌తో సిరీస్‌లో టీమ్ ఇండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే.. ఐరిష్ జట్టును అంత ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. టీమ్ ఇండియా- ఐర్లాండ్ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆదివారమే. డబ్లిన్ వేదికగా రెండు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ప్రారంభం అవుతాయి.
ఎందుకు భారతే ఫేవరేట్..?
దక్షిణాఫ్రికాతో గత సిరీస్‌లో 0-2 వెనకబడ్డ యువ భారత్.. తర్వాత పుంజుకున్న తీరు అద్భుతం. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ స్ఫూర్తితోనే ప్రస్తుతం ఐర్లాండ్‌లో అడుగుపెట్టింది. దాదాపు అందరూ ఫామ్‌లోనే ఉండటం కలిసొచ్చే అంశం. ముఖ్యంగా చివరి ఓవర్లలో రెచ్చిపోయే ఫినిషర్లు హార్దిక్, కార్తీక్.. ప్రారంభంలో ఇషాన్ కిషన్ మెరుపులు యువ భారత్‌కు ప్రధాన బలం. భువి స్వింగ్ , హర్షల్ స్లో బంతులు, అవేశ్ పేస్, స్పిన్‌తో మాయ చేసే చాహల్‌ను ఎదుర్కొవడం ప్రత్యర్థి బ్యాటర్లకు సవాలే.
వాళ్లని ఆడిస్తే..
గత సిరీస్‌లో బెంచ్‌కే పరిమితం అయిన దీపక్ హూడా, వెంకటేశ్ అయ్యర్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, బిష్ణోయ్‌కు తుది జట్టులో అవకాశం ఇస్తే.. సత్తాచాటాలని చూస్తున్నారు. భారత టీ20 లీగ్‌లో గాయపడిన స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్‌లో పూర్తి ఫిట్నెస్తో అడుగుపెడుతున్నాడు. సంజూ శాంసన్, తొలిసారి భారత జట్టుకు ఎంపికైన రాహుల్ త్రిపాఠి.. ఇలా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల హిట్టర్లు జట్టులో ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరు నిలబడిన.. మ్యాచ్‌పై ఐర్లాండ్ ఆశలు వదులుకోవాల్సిందే. అందుకే సీనియర్లు లేకపోయినా సమతూకంగా ఉన్న యువ భారత్ ఫేవరేట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఐర్లాండ్ ఫామ్‌లో ఉందా?
ఇటీవల ఒమన్‌లో 2022 టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీ జరిగింది. ఇందులో లీగ్ దశలో 3 మ్యాచ్‌లు ఆడి ఐర్లాండ్ రెండింట్లో గెలిచింది. దీంతో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక్కడ ఒమన్‌పై 56పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్ చేరింది. అయితే లీగ్ దశలో ఐర్లాండ్‌ను ఓడించిన యూఏఈ.. ఫైనల్లో వారిపై 7 వికెట్ల తేడాతో గెలిచి క్వాలిఫయర్ టోర్నీని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో ఐర్లాండ్ తరఫున బ్యాటింగ్‌లో హర్రీ టెక్టార్(4 మ్యాచ్‌ల్లో 116 ), పాల్ స్టిర్లింగ్ (5 మ్యాచ్‌ల్లో 116 ), గ్రేత్ డెన్లీ (5 మ్యాచ్‌ల్లో 113), కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్ని(5 మ్యాచ్‌ల్లో 100) పరుగులు చేశారు. బౌలింగ్‌లో క్రెగ్ యంగ్ 4 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు, జోష్ లిటిల్ 5 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు, ఆండ్రి మెక్‌బ్రిన్ 5 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టారు.
ఇంగ్లిష్ కౌంటీల్లో రాణిస్తున్న మార్క్ అడైర్ ఈ టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే ఓవరాల్‌గా టీ20 క్రికెట్లో మంచి పేస్‌తో 39 మ్యాచ్‌ల్లో 59 వికెట్లు తీశాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసి వెలుగులోకి వచ్చిన కర్టిస్ కాంఫర్.. ఇప్పటివరకు ఆడిన 12 టీ20 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. ఇదే మ్యాచ్‌లో 29 బంతుల్లోనే 44 పరుగులు చేసిన గ్రెత్ డెన్లీ మొత్తంగా 37 టీ20 మ్యాచ్‌ల్లో 694 పరుగులు చేశాడు. వీరితోపాటు కెప్టెన్ ఆండ్రూ బల్బిర్ని(67 టీ20 మ్యాచ్‌ల్లో 1429), సీనియర్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ 102 మ్యాచ్‌ల్లో 2776 పరుగులతో టీ20 క్రికెట్లో మంచి రికార్డు కలిగి ఉన్నారు. వీరంతా సమష్టిగా రాణించడంపై ఐర్లాండ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.