తెలంగాణ

telangana

ETV Bharat / sports

నయా 'వీరు'డు పంత్​ రికార్డుల మోత.. దిగ్గజాలను సైతం వెనక్కినెట్టి.. - rishabh pant england test

సుదీర్ఘ ఫార్మాట్‌లో రాణించాలంటే కాస్త ఓర్పు కావాలంటారు.. ఆచితూచి ఆడుతూ పరుగులు రాబట్టాలి. నిలకడగా ఆడి రన్స్ చేస్తేనే జట్టులో స్థానం పదిలంగా ఉంటుంది. కానీ ఇవేవీ ఒకప్పుడు వీరేంద్ర సెహ్వాగ్‌కు నచ్చేవి కావు. ఇప్పుడు ఈ టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ కూడా అంతే.. అయితే ఒకవైపు కీలకమైన సమయాల్లో అనవసర షాట్లకు పోయి ఔట్‌ అవుతున్నాడనే విమర్శలు చెలరేగుతున్నా.. తన దూకుడును మాత్రం తగ్గించేదేలే అంటూ విరుచుకుపడటం నయా 'వీరు'డు రిషభ్‌ పంత్‌ స్టైల్‌. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్​లో పంత్​ తిరగరాసిన రికార్డుల వివరాలు ఓ సారి చూద్దాం.

rishabh panth records
rishabh panth records

By

Published : Jul 2, 2022, 12:43 PM IST

IND Vs ENG Test Match: కీలకమైన ఇంగ్లాండ్‌తో టెస్టులో టాప్‌ బ్యాటర్లంతా చేతులెత్తేసిన సమయంలో జడ్డూభాయ్‌తో కలిసి రిషభ్‌ (146) ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టాడు. తనదైన శైలిలో బ్యాటింగ్‌ చేస్తూనే అరవీర భయంకర పేసర్లను ఎదుర్కొని శతకం సాధించడం సాధారణ విషయమేమీ కాదు. అండర్సన్, బ్రాడ్‌తోపాటు పాట్స్‌ వంటి కొత్త బౌలర్‌ను అడ్డుకొని మరీ పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో ఎన్నో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకొన్నాడు. పంత్​ సాధించిన రికార్డుల వివరాలను ఓ సారి పరిశీలిద్దాం.

2000 పరుగులు చేసిన వికెట్​ కీపర్​గా..
రిషభ్‌ పంత్ తన టెస్టు కెరీర్‌లో ఐదు సెంచరీలు బాదాడు. ఇందులో మూడు ఇంగ్లాండ్‌పైనే కావడం గమనార్హం. అందులోనూ ఇంగ్లీష్‌ గడ్డపై రెండు సెంచరీలు ఉన్నాయి. విదేశీ పిచ్‌లు అంటే పేస్‌కు స్వర్గధామం. అలాంటి పిచ్‌లపై నాలుగు శతకాలు చేశాడు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండేది. అయితే '90'ల్లో ఔటై కొన్ని మ్యాచ్‌ల్లో పెవిలియన్‌కు చేరాడు. అయితే ఈసారి మాత్రం ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సెంచరీ పూర్తి చేసేశాడు. ఈ క్రమంలో అత్యంత చిన్న వయస్సులో 2000 పైచిలుకు టెస్టు పరుగులు చేసిన వికెట్‌ కీపర్‌గా అవతరించాడు.

రిషభ్​ పంత్​

రిషభ్‌ పంత్‌ టెస్టు సెంచరీల వివరాలు

  • మొత్తం టెస్టులు : 31 (ఇప్పుడు ఆడుతున్నదానితో కలిపి)
  • సెంచరీలు: 5
  • లండన్‌ వేదికగా ఇంగ్లాండ్‌పై (114) 2018లో
  • సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాపై (159*) 2019లో
  • అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌పై (101) 2021లో
  • కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాపై (100) 2022లో
  • బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇంగ్లాండ్‌పై (146) 2022లో

వంద సిక్సర్లు కొట్టి రికార్డు.. సచిన్​ను అధిగమించి..
అంతర్జాతీయ క్రికెట్​లో వంద సిక్సు​లు కొట్టిన అతి పిన్న వయస్కుడైన ఇండియన్ క్రికెటర్​గా పంత్ నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ సచిన్ పేరిట ఉంది. 25 ఏళ్ల వయసులో సచిన్ వంద సిక్సులు మైలురాయిని చేరుకున్నాడు. ఇంగ్లాండ్ మ్యాచ్ ద్వారా పంత్ 24 ఏళ్ల 271 రోజుల్లోనే ఈ ఘనతను చేరుకుని సచిన్ రికార్డును తిరగరాశాడు. స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్​లో సిక్స్ కొట్టడం ద్వారా పంత్ ఈ రికార్డును అందుకున్నాడు.

రిషభ్​ పంత్​

నాలుగు శతకాలు బాదిన తొలి వికెట్​ కీపర్​గా..
వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న పంత్​.. టెస్టు కెరీర్‌లో ఐదో శతకాన్ని సాధించాడు. ఆసియా వెలుపల నాలుగు శతకాలు బాదిన తొలి భారత వికెట్ కీపర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. అలాగే ఒకే క్యాలెండర్ ఇయర్‌లో రెండు టెస్టు సెంచరీలు నమోదు చేసిన కీపర్‌గానూ పంత్‌ ఘనత సాధించాడు. ఇక ఆసియా వెలుపల అత్యంత వేగంగా టెస్టు సెంచరీ నమోదు చేసిన భారత వికెట్ కీపర్‌గా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇంగ్లండ్‌లో రెండు టెస్టు సెంచరీలు చేసిన ఏకైక భారత వికెట్ కీపర్ కూడా నిలిచాడు.

ఉప్పంగిపోయిన ద్రవిడ్​..
ఈ మధ్యకాలంలో పంత్‌పై విమర్శలు వచ్చిన సమయంలో టీమ్​ఇండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అతడికి అండగా నిలిచాడు. తాజాగా ద్రవిడ్​ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు పంత్‌. శుక్రవారం జరిగిన మ్యాచ్​లో 111 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సులుతో 146 పరుగులు చేశాడు. దీంతో ద్రవిడ్‌ సంతోషంతో ఉప్పొంగిపోయాడు. డగౌట్‌లో కూర్చుని మ్యాచ్‌ వీక్షిస్తున్న ద్రవిడ్‌.. ఒక్కసారిగా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ చిరునవ్వులు చిందిస్తూ పంత్‌ను అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్‌ అవుతోంది.

డిఫెన్స్‌ చాలా కీలకం: పంత్
ఇంగ్లాండ్‌తో తొలి రోజు ఆట ముగిసేససమయానికి భారత్‌ 338/7 స్కోరుతో నిలిచింది. క్రీజ్‌లో రవీంద్ర జడేజా (83*), షమీ (0*) ఉన్నారు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం రిషభ్ పంత్ మాట్లాడాడు. "ఈ మ్యాచ్‌లో వందశాతం ఆడేందుకు ప్రయత్నించా. నా చిన్నప్పటి నుంచి క్రికెట్ పైనే ధ్యాస ఉంచా. బంతిని ఎంత హిట్‌ చేసినా.. డిఫెన్స్‌ మీద దృష్టి పెట్టాలని నా చిన్ననాటి కోచ్ తారక్‌ చెప్పేవారు. టెస్టులో డిఫెన్స్ చాలా కీలకం. అందుకే చెత్త బంతిని బౌండరీకి తరలించి మిగతావాటిని డిఫెన్స్‌ ఆడాను. ఇంగ్లాండ్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఇంగ్లాండ్‌లోని పిచ్‌ పరిస్థితులు పేస్‌కు అనుకూలంగా ఉంటాయి. జడేజాతో భాగస్వామ్యం నిర్మించడం అద్భుతంగా ఉంది. బంతిపైనే దృష్టి పెట్టాలని మాట్లాడుకుంటూ ఉన్నాం" అని రిషభ్‌ పంత్ వివరించాడు. జడేజా, రిషభ్‌ కలిసి ఆరో వికెట్‌కు 222 పరుగులు జోడించారు.

ఇవీ చదవండి:'సార‌థిగా కంటే బౌల‌ర్‌గానే జ‌ట్టుకు బుమ్రా అవ‌స‌రం'

శతక్కొట్టిన పంత్.. ధోనీ రికార్డు బద్దలు.. జట్టుకు ఆపద్బాంధవుడిగా..

చెలరేగిన పంత్, జడేజా.. తొలి రోజు ఆట ముగిసే సరికి..

ABOUT THE AUTHOR

...view details