పంత్, హార్దిక్ ధనాధన్ ఇన్నింగ్స్.. టీమ్ఇండియాదే సిరీస్
22:45 July 17
మూడో వన్డేలో టీమ్ఇండియా గెలుపు
Teamindia won the series: హార్దిక్ పాండ్య ఆల్‌రౌండ్ ప్రదర్శనకు( 71, నాలుగు వికెట్లు) పంత్(125*) సెంచరీ తోడవ్వడం వల్ల ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో 2-1తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. 260 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమ్ఇండియా.. 42.1 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పంత్, పాండ్య.. ఐదో వికెట్‌కు 115 బంతుల్లో 133 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన వేళ వీరిద్దరూ మొదట ఆచితూచి ఆడారు. తర్వాత క్రీజులో కుదురుకున్నాక ఇంగ్లాండ్ బౌలర్లపై చెలరేగిపోయారు. అయితే, జట్టు 205 పరుగులకు చేరాక పాండ్య ఔటయ్యాడు. అయినా, జడేజా (7)తో కలిసి పంత్ ఆఖర్లో దూకుడుగా ఆడుతూ సెంచరీ చేయడమే కాకుండా టీమ్‌ఇండియాను విజయ తీరాలకు చేర్చాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. హార్దిక్ పాండ్య (4/24), యుజ్వేంద్ర చాహల్ (3/60) ఇంగ్లిష్ జట్టు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ (60) అర్ధశతకంతో రాణించగా.. ఓపెనర్ జేసన్ రాయ్ (41) రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో క్రేగ్ ఓవర్టన్ (32), డేవిడ్ విల్లే (18) ఎనిమిదో వికెట్‌కు కీలకమైన 48 పరుగుల భాగస్వామ్యం జోడించారు. భారత బౌలర్లలో హార్దిక్ 4, చాహల్ 3, సిరాజ్ 2, జడేజా 1 వికెట్ తీశారు.