IND VS ENG Second T20: పేలవ ఫామ్‌తో సతమతం అవుతున్న టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి.. మరో పరీక్షకు సిద్ధమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టులో చోటు నిలబెట్టుకోవాలంటే తప్పక రాణించాల్సిన స్థితిలో అతను ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో బరిలోకి దిగుతున్నాడు. యువ ఆటగాళ్ల దూకుడుతో జట్టులో ప్రతి స్థానానికీ పోటీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో మెరుగ్గా ఆడటం కోహ్లికి ఎంతో కీలకం.
భీకర బ్యాట్స్‌మెన్‌తో నిండిన ఇంగ్లాండ్‌తో కఠిన సవాలు తప్పదనుకున్న టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను అలవోకగా గెలుచుకుంది టీమ్‌ఇండియా. అదే ఊపులో సిరీస్ సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో శనివారం రెండో టీ20లో బరిలోకి దిగనుంది. ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడడంతో తొలి టీ20కి దూరంగా ఉన్న విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నారు. వీరిలో ప్రధానంగా కోహ్లి మీదే అందరి దృష్టి నిలిచి ఉంది. రెండేళ్లకు పైగా ఏ ఫార్మాట్లోనూ సెంచరీ చేయని అతను.. ఇటీవల మరీ తీసికట్టుగా ఆడుతున్నాడు. అర్ధశతకాలు కూడా కరవైపోతున్నాయి. ఇంగ్లాండ్‌తో చివరి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 31 పరుగులే చేశాడు. గత ఏడాది టీ20ల్లో తాను చివరగా కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రపంచకప్ తర్వాత అతను ఈ ఫార్మాట్లో ఆడింది రెండే మ్యాచ్‌లు. త్వరలో వెస్టిండీస్ పర్యటనకూ దూరం కానున్నాడని వార్తలొచ్చాయి. దీపక్ హుడా, ఇషాన్ కిషన్ లాంటి కుర్రాళ్లు అదరగొడుతుండటం, సూర్యకుమార్ జట్టులో కుదురుకోవడం, హార్దిక్ పాండ్య సైతం పూర్వపు ఫామ్‌ను అందుకోవడంతో కోహ్లికి తుది జట్టులో చోటుపై ఇప్పటికే చర్చ జోరందుకుంది. ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు రేసులో ఉండాలంటే ఇంగ్లాండ్‌తో చివరి రెండు టీ20ల్లో అతను సత్తా చాటాల్సిందే.
ఖాళీ చేసేదెవరు?:కోహ్లితో పాటు బుమ్రా, పంత్, జడేజా ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తుండగా.. అందరినీ తుది జట్టులో ఆడిస్తారా, ఆడిస్తే వారి కోసం స్థానాలు ఖాళీ చేసేదెవరు అన్నది ఆసక్తికరం. ఐర్లాండ్‌తో రెండు టీ20ల్లో, ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో కోహ్లి ఆడే మూడో స్థానంలో దీపక్ హుడా ఆడాడు. మూడు మ్యాచ్‌ల్లోనూ అతను అదరగొట్టాడు. అంత మంచి ఫామ్‌లో ఉన్న హుడాను తప్పించడం ఇబ్బందే. కానీ తప్పకపోవచ్చు. పంత్ కోసం దినేశ్ కార్తీక్‌ను తప్పిస్తారా.. లేక ఇషాన్‌పై వేటు వేస్తారా అన్నది చూడాలి. ఇషాన్‌పై వేటు పడితే కోహ్లి ఓపెనింగ్‌లో వచ్చే అవకాశముంది. గురువారమే అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్.. మిగతా రెండు టీ20ల కోసం ఎంపిక చేసిన జట్టులో లేడు. అతడి స్థానంలో బుమ్రా ఆడనున్నాడు. అక్షర్ స్థానంలో జడేజాను ఆడించొచ్చు.