తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ, రోహిత్ ఇద్దరే ఉన్నారు.. ఆ పని మళ్లీ చేస్తారా? - kl rahul

విదేశాల్లో టీమ్​ఇండియా టెస్టు సిరీస్​లు ఓడిపోవడానికి ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యం. ఇంగ్లాండ్​ గడ్డపై గత ఏడేళ్లలో జరిగిన 14 టెస్టుల్లో కేవలం నాలుగు మాత్రమే భారత్ గెలిచింది. నలుగురు బ్యాటర్లు శతకాలు చేసి.. ఆ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. వారిలో ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రమే ప్రస్తుతం జట్టులో ఉన్నారు. ఈ ఇద్దరు మరోసారి అలాంటి మేటి ఇన్నింగ్స్​ ఆడతారా?

Team India
Ind vs Eng

By

Published : Jun 25, 2022, 11:59 AM IST

Updated : Jun 25, 2022, 1:18 PM IST

విదేశీ టెస్టు సిరీస్‌ల్లో టీమ్‌ఇండియాని వేధించే ప్రధాన సమస్య బ్యాటర్ల వైఫల్యం. గత మూడు పర్యాయాలు ఇంగ్లాండ్‌లో ఓడిపోవడానికి కారణమదే. మన బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడితే ఎలాంటి విజయాలు వస్తాయో గతంలో చూశాం. 2014 నుంచి 2021 వరకు ఇంగ్లాండ్‌లో ఆడిన 14 టెస్టుల్లో భారత్‌ 4 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. ఈ 4 మ్యాచ్‌ల్లో శతకాలతో రాణించిన ఆ భారత ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం!

రహానె

లార్డ్స్‌లో రహానె క్లాస్‌:2014 టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్‌ అది. వేదిక లార్డ్స్‌. పిచ్‌ స్వింగ్‌, పేస్‌కు అనుకూలమని భావించిన ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పచ్చిక పిచ్‌పై పేసర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ నిప్పులు చెరిగారు. జిమ్మి స్వింగ్‌తో వికెట్ల వేట ప్రారంభిస్తే, బ్రాడ్‌ పదునైన పేస్‌తో భారత్‌ బ్యాటర్లను ఇబ్బందిపెడుతున్నాడు. దీంతో 83 పరుగులకే భారత్‌ టాప్‌ ఆర్డర్ పెవిలియన్‌ చేరింది. ఈ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన రహానె తన ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జట్టులో మిగిలిన ఆటగాళ్లు షాట్లు ఆడడానికి కష్టపడుతుంటే తను మాత్రం ఎడాపెడా బౌండరీలు బాదుతున్నాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో చెలరేగిన అండర్సన్, బ్రాడ్‌ కూడా రహానెను అంత త్వరగా ఔట్‌ చేయలేకపోయారు.

భువనేశ్వర్‌ (36)తో కలిసి జట్టు స్కోరు 200 దాటించాడు. ఈ క్రమంలోనే రహానె సెంచరీ (154 బంతుల్లో 103 ; 15X4,1X6) పూర్తి చేశాక .. అండర్సన్‌ బౌలింగ్‌లోనే అతడికి క్యాచ్‌ ఇచ్చి తొమ్మిదో వికెట్‌ రూపంలో వెనుదిరిగాడు. రహానె అద్భుతమైన ప్రదర్శనతో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 295 పరుగులు చేయగలిగింది. మొదటి ఇన్నింగ్స్‌లో భువనేశ్వర్‌ (6) వికెట్లు తీయడంతో భారత్‌ ఇంగ్లాండ్‌ను 319 పరుగులకు ఆలౌట్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌ విజయ్‌, జడేజా అర్ధ శతకాలతో భారత్‌ 342 పరుగులు చేసింది. ఆ తరవాత ఇషాంత్‌ శర్మ విజృంభణతో (7 వికెట్లు) భారత్‌ ఈ మ్యాచ్‌లో 95 పరుగుల తేడాతో గెలిచింది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌లో టీమ్‌ఇండియా 28 ఏళ్ల తరవాత విజయాన్ని నమోదు చేసింది. ఈ చిరస్మరణీయ శతకం (103) రహానె కెరీర్‌లో గొప్ప ఇన్నింగ్స్‌గా నిలిచింది.

కోహ్లీ

కోహ్లీ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌..:అంతకుముందు ఇంగ్లాండ్‌ పర్యటన (2014) విరాట్‌కు పీడకలలాంటిది. కోహ్లీ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొత్తం 134 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో విరాట్‌ 2018లో ఎలాగైనా పరుగులు చేయాలని ఇంగ్లిష్‌ గడ్డపై అడుగుపెట్టాడు. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన మొదటి టెస్టులో కోహ్లీ ఆట ఎలా ఉంటుందో ఇంగ్లిష్‌ బౌలర్లకు చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 149, రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులతో రాణించాడు. అయితే మిగతా బ్యాటర్ల వైఫల్యంతో 31పరుగుల తేడాతో భారత్‌ ఓటమి పాలైంది. రెండో టెస్టులో సైతం పరాజయం చెందింది. ట్రెంట్‌బిడ్జ్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో కోహ్లీ మరోసారి సత్తాచాటాడు. దీంతో భారత్ ఈ సారి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ కోహ్లీ(97),పూజారా (81) రాణించడంతో మొదటి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్‌ అయింది. హార్దిక్‌ బౌలింగ్‌లో మెరవడంతో (5వికెట్లు) ఇంగ్లాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే కుప్పకూలింది.

కీలక ఆధిక్యం సాధించిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ మిస్ అయిన విరాట్‌ రెండో ఇన్నింగ్స్‌లో శతకం (197 బంతుల్లో 103; 10 ఫోర్లు) సాధించాడు. పూజారా(72)తో కలిసి 100 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. పూజారా ఔటయ్యాక స్కోరు వేగం పెంచిన కోహ్లీ.. ఈ క్రమంలోనే వోక్స్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టి తన కెరీర్‌లో 23వ శతకాన్ని అందుకొన్నాడు. ఆ తరవాతి బంతికే వోక్స్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అప్పటికే ఇంగ్లాండ్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరకు 352/7 వద్ద టీమ్‌ఇండియా డిక్లేర్‌ చేసింది. భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ను బుమ్రా( 5 వికెట్లు) దెబ్బకు 317 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్‌ 203 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లీ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు.

రాహుల్

కేఎల్‌ అదరహో:భారత్‌ 2021లో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడేందుకు మరోసారి ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లింది. ట్రెంట్‌బిడ్జ్‌ వేదికగా జరిగిన మొదటి టెస్టులో చివరి రోజు వర్షం శాసించి మ్యాచ్‌ డ్రా గా ముగిసింది. రెండో టెస్ట్‌ జరిగే లార్డ్స్‌లో మ్యాచ్‌కు ముందు వర్షం పడటంతో పిచ్‌ నెమ్మదిగా ఉంటుందని భావించిన ఇంగ్లాండ్‌ టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకొంది. భారత బ్యాటర్ల వికెట్లను తేలికగా పడగొట్టొచ్చని అనుకున్న ఇంగ్లాండ్‌ బౌలర్ల వ్యూహం బెడిసికొట్టింది. దీనికి కారణం కేఎల్‌ రాహుల్‌ ఇన్నింగ్స్‌. భారత్‌ మొదటి ఇన్నింగ్స్ తొలి 10 ఓవర్లలో 11 పరుగులే వచ్చాయి. అయితే పట్టుదలగా క్రీజ్‌లో నిలిచిన రాహుల్‌.. మరో ఓపెనర్‌ రోహిత్‌ (83)తో కలిసి 127 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రోహిత్‌ ఔటయ్యక క్రీజ్‌లోకి వచ్చిన పూజారా (9) విఫలమయ్యాడు. కోహ్లీ (42)తో కలిసి రాహుల్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. తొలి రోజు ఆఖరి సెషన్‌లో అండర్సన్‌ బౌలింగ్‌లో బౌండరీలు బాదడం ద్వారా స్కోరు వేగాన్ని పెంచాడు. ఈ క్రమంలోనే బౌలింగ్‌లో థర్డ్‌ మ్యాన్‌ దిశగా బాదిన బౌండరీతో 212 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

దీంతో తొలిరోజు భారత్‌ 276/3 స్కోరు చేయగలిగింది. అయితే రెండో రోజు అండర్సన్‌ విజృంభణ( 5వికెట్లు)తో భారత్ 364 పరుగులకు ఆలౌట్‌ అయింది. రాహుల్( 250 బంతుల్లో 129; 12ఫోర్లు, 1 సిక్స్‌) చేసి రాబిన్సన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. రూట్‌ భారీ శతకం (180)తో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ ఒక దశలో 181/6 పరుగులకే కీలక వికెట్లు కోల్పోయింది. పంత్‌, ఇషాంత్‌ ఔటయ్యాక..షమీ(56), బుమ్రా (34) పోరాటంతో 298/8 వద్ద డిక్లేర్‌ చేసింది.చివరి రోజు ఆటలో 60 ఓవర్లు మిగిలి ఉండగా...272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను మొదట్లో బుమ్రా(3వికెట్లు ), చివర్లో సిరాజ్‌(4వికెట్లు ) దెబ్బతీశారు. దీంతో ఇంగ్లాండ్‌ 120 పరుగులకే ఆలౌట్‌ అయింది. భారత్‌ లార్డ్స్‌లో 151 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. అద్భుత శతకంతో భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన రాహుల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

రోహిత్

రోహిత్‌ సూపర్‌ షో:భారత్‌, ఇంగ్లాండ్‌ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ (2021)లో కీలక మ్యాచ్‌ అది. తొలి మ్యాచ్‌ డ్రా అయ్యాక.. ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. మరో టెస్టు గెలిస్తే ఆ జట్టు సిరీస్‌లో ముందజ వేస్తుంది. దీంతో ఓవల్‌లో జరిగిన నాలుగో టెస్టు ఇరు జట్లకు కీలకం. పిచ్‌ పూర్తిగా పేసర్లకు అనుకూలం. ఇంగ్లిష్‌ బౌలర్లు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 191 పరుగులకే చుట్టేశారు. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 63పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే పోప్‌, వోక్స్‌ అర్ధశతకాలతో 291 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. దీంతో 99 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తీవ్ర ఒత్తిడిలో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్‌కు రోహిత్‌ శర్మ అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. రాహుల్‌(45), పూజారా(61)తో కలిసి కీలక భాగస్వామ్యాలు ఏర్పాటు చేశాడు.

ఈ క్రమంలోనే మొయిన్‌ బౌలింగ్‌లో లాంగాన్‌ మీదుగా సిక్స్‌ బాది 204 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్‌కు విదేశీగడ్డపై ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. రోహిత్‌ మూడో వికెట్‌కు పూజారాతో కలిసి 153 పరుగులు జోడించాడు. భారత స్కోరు 236 ఉన్నప్పుడు రాబిన్సన్‌ బౌలింగ్‌లో వోక్స్ క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ (256 బంతుల్లో 127;14 ఫోర్లు, 1 సిక్స్‌) ఔట్‌ అయ్యాడు. పంత్‌, శార్దూల్‌ అర్ధశతకాలు చేయడంతో భారత్‌ 466 భారీ స్కోరు చేసి ఆలౌట్‌ అయింది. 368 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ భారత బౌలర్ల ధాటికి 210 పరుగులకే కుప్పకూలింది. కీలక సమయంలో సెంచరీతో రాణించిన రోహిత్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఓవల్ వేదికపై 50 ఏళ్ల తరవాత భారత్‌ టెస్టు మ్యాచ్‌ గెలిచింది. దీంతో పాటు సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలో నిలిచింది.

పై నలుగురిలో జులై 1 నుంచి ప్రారంభమయ్యే నిర్ణయాత్మక ఐదో టెస్టులో ఇద్దరే ఆడుతున్నారు. గాయంతో కేఎల్‌ రాహుల్ దూరమవ్వగా, ఫామ్‌ లేమితో అజింక్య రహానె జట్టుకు దూరమయ్యాడు. దీంతో మిగిలిన విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఈ టెస్టులో శతకాలు చేస్తే భారత గెలిచే అవకాశాలు ఎక్కువ. మరి కింగ్‌, హిట్‌ మ్యాన్‌ ఏం చేస్తారో చూడాలి.

ఇదీ చూడండి:ఒకే ఒక్కడు 'మిచెల్​'.. ఇంగ్లాండ్​పై 400 పరుగులు చేసి రికార్డు!

Last Updated : Jun 25, 2022, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details