లీడ్స్ హెడ్డింగ్లీ వేదికగా మరికాసేపట్లో ఇంగ్లాండ్- ఇండియా మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో టీమ్ఇండియా ఆధిక్యంలో ఉంది. అదే ఊపుతో తాజా మ్యాచ్‌లోనూ విజయాన్ని అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. లార్డ్స్ టెస్టుకు ప్రతీకారం తీర్చుకోవాలని రూట్ సేన భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. అయితే అంతకంటే ముందు ఈ టెస్టు ద్వారా ఇరుజట్ల ఆటగాళ్లకు పలు రికార్డులు చేరుకునే అవకాశం ఉంది. అవేంటో ఓ సారి చూద్దాం.
విరాట్ కోహ్లీ..
రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ.. అన్ని ఫార్మాట్లలో కలిపి 23 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచేందుకు మరో 63 పరుగుల దూరంలో ఉన్నాడు. మూడు ఫార్మాట్లలో 487 ఇన్నింగ్స్‌ల్లో ప్రస్తుతం 22,937 పరుగులు సాధించాడు టీమ్ఇండియా రన్ మిషన్. 500లోపు ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ చేరుకోవడానికి కోహ్లీకి పెద్ద కష్టమేమీ కాదు. ఇంగ్లాండ్ గడ్డపై ఇంకా మూడు టెస్టులు ఉన్న నేపథ్యంలో అతడు ఒక్క ఇన్నింగ్స్‌లో కుదురుకున్న ఆ మాత్రం స్కోరు సులువుగా చేయగలడు.
ఇక టెస్టుల్లో విరాట్ 2019 నవంబర్‌లో చివరిసారిగా సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత మూడంకెల స్కోరు అందుకోవడానికి కోహ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తాజా టెస్టులో మన చీకూ ఈ శతకాల కొరత అధిగమిస్తాడని ఆశిద్దాం.
రోహిత్ శర్మ..
ఇటీవల కాలంలో టెస్టుల్లో స్థిరంగా రాణిస్తున్నాడు భారత ఓపెనర్ రోహిత్ శర్మ. ఈ ఫార్మాట్లో అతడు మరో 169 పరుగులు సాధిస్తే టెస్టుల్లో 3వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. మరో 130 రన్స్ చేస్తే కనుక అన్ని ఫార్మాట్లలో కలిపి 15వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు.