ఆంగ్లేయుల గడ్డపై టీమ్‌ఇండియా(Teamindia england tour) దుమ్మురేపుతోంది. నాలుగో టెస్టులో అద్వితీయ విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీసులో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. దాదాపుగా 50 ఏళ్ల తర్వాత ఓవల్ మైదానంలో గెలుపు బావుటా ఎగరేసింది. ఆశల్లేని స్థితిలోంచి పుంజుకొని అద్భుతంగా మ్యాచ్‌ను ముగించింది.
ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 191 పరుగులే చేసింది. ఇంగ్లాండ్ 290 రన్స్‌తో బదులివ్వడం వల్ల రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన భారీ స్కోరు చేయాల్సి వచ్చింది. అందుకు తగ్గట్టే ఆటగాళ్లంతా సమష్టిగా ఆడి 466 పరుగులు చేశారు. రోహిత్ (127) శతకంతో అదరగొట్టగా.. పుజారా (61), రిషభ్ పంత్ (50), శార్దూల్ ఠాకూర్ (60) అర్ధశతకాలు బాదేశారు. ఇక కేఎల్ రాహుల్ (46), విరాట్ కోహ్లీ (44), ఉమేశ్ యాదవ్ (25), జస్ప్రీత్ బుమ్రా (24) సమయోచితంగా ఆడారు.