లార్డ్స్ టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. జో రూట్ (48*), బెయిర్ స్టో (6*) నాటౌట్‌గా నిలిచారు. టీమ్ఇండియా బౌలర్లలో సిరాజ్ 2, షమీ ఒక్క వికెట్‌తో మెరిశారు.
276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన కోహ్లీసేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్కోరు బోర్డులో రెండు పరుగులు జత అయ్యాయో లేదో రాహుల్ వెనుదిరిగాడు. మరో నాలుగు పరుగులకే రహానె కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత పంత్-జడేజా జోడీ కాస్త ప్రతిఘటించింది. ఆరో వికెట్‌కు ఈ జంట 49 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ ద్వయాన్ని మార్క్ వుడ్ విడదీశాడు. పంత్‌ను కీపర్ క్యాచ్‌గా వెనక్కి పంపాడు.
వికెట్ పడ్డ ఆనందంలో టీమ్ఇండియా ఆటగాళ్లు ఆ తర్వాత వచ్చిన వారెవరూ ధాటిగా ఆడే ప్రయత్నం చేయలేదు. క్రీజులో రవీంద్ర జడేజా ఉన్నా మరో ఎండ్‌లో అతడికి సహకారం లభించలేదు. దీంతో ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి చివరి వికెట్‌గా జడేజా పెవిలియన్ చేరాడు. 88 పరుగులకే చివరి 7 వికెట్లను కోల్పోయింది టీమ్ఇండియా. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ 5 వికెట్లతో మెరిశాడు. మార్క్ వుడ్, రాబిన్సన్ తలో రెండు వికెట్లతో రాణించారు.
తొలి ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా మొదలు పెట్టిన రూట్ సేన. వికెట్లేమీ నష్టపోకుండా టీ విరామానికి వెళ్లింది. తొలి వికెట్‌కు 23 పరుగులు జోడించాక.. సిరాజ్ ఈ జంటను విడదీశాడు. వరుస బంతుల్లో సిబ్లీతో పాటు హసీబ్ హమీద్‌ను పెవిలియన్ చేర్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రూట్ బర్న్స్‌కు సహకరించాడు. ఈ జంట ఆచితూచి ఆడుతూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదింది. మూడో వికెట్‌కు ఈ ద్వయం 85 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న బర్న్స్‌ను షమీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
ఇదీ చదవండి:T20 World cup: జట్టులో 15 మందికి మాత్రమే.. కానీ!