Ind vs Ban World Cup 2023 :2023 ప్రపంచకప్‌లో భాగంగా భారత్.. అక్టోబర్ 19 గురువారం పుణె వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మెగాటోర్నీలో గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన బంగ్లా.. ఈ మ్యాచ్‌తోనైనా గెలుపు బాట పట్టాలని చూస్తోంది. అయితే అది అంత సులభం కాదని బంగ్లాకు కూడా తెలుసు. కానీ, 2023 ఆసియా కప్‌లో టీమ్ఇండియాపై విజయం సాధించడం వల్ల వారి ఆత్మవిశ్వాసం పెరిగిందనడంలో సందేహం లేదు. ఇక ఈ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్.. గురువారం నాటి మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్‌కు మరింత చేరువవ్వాలని ఆశిస్తోంది.
అత్యంత పటిష్ఠంగా భారత్..టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌తో బ్యాటింగ్ విభాగం భీకరంగా ఉంది. ఆల్‌రౌండర్లు హార్దిక్, రవీంద్ర జడేజా బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించగలిగే సత్తా ఉన్నవాళ్లే. గత మూడు మ్యాచ్‌ల్లోనూ వీరిద్దరూ జట్టుకు అవసరమైనప్పుడల్లా వికెట్ తీసి బ్రేక్ ఇచ్చారు. ముఖ్యంగా గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై.. హార్దిక్ మంత్రం చదివి వికెట్ తీసిన తీరు నెట్టింట తెగ వైరలైంది. ఇక బౌలర్లు బుమ్రా, సిరాజ్, కుల్‌దీప్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విషయం తేలిసిందే..
బంగ్లాను తేలిగ్గా తీసుకోలేం..క్రికెట్లోకి చిన్న జట్టుగా ఎంట్రీ ఇచ్చిన బంగ్లాదేశ్.. ఇప్పటికే అనేక సంచలన విజయాలు నమోదు చేసింది. బంగ్లా, భారత్‌ను సైతం పలుమార్లు ఓడించి ఝలక్ ఇచ్చింది. రీసెంట్గా 2023 ఆసియా కప్ సూపర్ 4లోనూ భారత్‌పై బంగ్లాదేశ్ నెగ్గింది. ఈ మ్యాచ్ సహా గత నాలుగు వన్డేల్లో భారత్‌పై బంగ్లాదేశ్‌దే పైచేయి. కానీ, అప్పుడు టీమ్ఇండియా ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. ఇక ప్రస్తుతం ఆ జట్టులో ఎలాంటి సమయంలోనైనా ప్రత్యర్థి జట్లకు షాక్ ఇవ్వగలిగే ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా కెప్టెన్ షకిబ్ అల్ హసన్‌తో పాటు ముష్ఫికర్ రహీమ్, పేసర్ ముస్తాఫిజర్, తస్కిన్ అహ్మద్ కీలకంగా మారారు. కాబట్టి బంగ్లాతో పోరులో అలసత్వం ప్రదర్శించకూడదు.