తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS BAN: టెస్ట్​ సమరానికి రంగం సిద్ధం.. టీమ్​ఇండియా ఏం చేస్తుందో? - టీమ్​ఇండియా బంగ్లాదేశ్ తొలి టెస్ట్​

పసికూన అనుకొంటే రెచ్చిపోయి బలమైన టీమ్‌ను ఓడించి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది​. తాజాగా మరో సిరీస్‌ కోసం సిద్ధమవుతోంది. అదే బంగ్లాదేశ్​. బుధవారం నుంచి టీమ్​ఇండియాతో టెస్ట్ సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్​లో గాయాల బాధ వెంటాడుతున్న టీమ్‌ఇండియాను రాహుల్ ద్వయం ఎలా ముందుకు తీసుకెళ్తుందేమోనని అభిమానుల్లో ఆందోళన కొనసాగుతోంది.

IND VS BAN Test series
IND VS BAN: టెస్ట్​ సమరానికి రంగం సిద్ధం.. టీమ్​ఇండియా ఏం చేస్తుందో?

By

Published : Dec 13, 2022, 4:53 PM IST

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో ఘోర ఓటమిని చవిచూసిన భారత జట్టు ఇక టెస్ట్‌ సమరానికి సిద్ధమైంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ చిట్టగాంగ్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభం కానుంది. గాయం కారణంగా కెప్టెన్ రోహిత్‌ శర్మ సిరీస్‌కు దూరమైన నేపథ్యంలో కేఎల్​ రాహుల్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. వైస్‌కెప్టెన్‌గా ఛతేశ్వర్ పుజారాను జట్టు యాజమాన్యం నియమించింది. ఇప్పటికే ఫామ్‌లేమితో బాధపడుతున్న కేఎల్​ రాహుల్‌కు అటు బ్యాటర్‌తో పాటు కెప్టెన్‌గానూ ఈ సిరీస్ కీలకంగా మారింది. ఈ సిరీస్‌లో వచ్చే ఫలితంపై ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా భవిష్యత్ ఆధారపడి ఉంది. ప్రస్తుతం ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్ షిప్‌ పట్టికలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంకల తర్వాత భారత్ నాలుగోస్థానంలో ఉంది. 2023 జూన్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే బంగ్లాతో జరిగే 2 టెస్ట్‌లతోపాటు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత్‌కు ఈ సిరీస్‌ ఎంతో కీలకంగా మారింది.

తొలి టెస్ట్‌కు ఆతిథ్యమిచ్చే చిట్టగాంగ్ మైదానం బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. టెస్టుల్లో పటిష్ఠంగా ఉన్న భారత్‌కు రోహిత్‌, బుమ్రా, షమీ, జడేజా దూరం కావడం గట్టి ఎదురుదెబ్బగా మారింది. స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌లపై జడేజా లేని లోటు భారత్‌కు స్పష్టంగా కనిపిస్తుంది. ఉపఖండ పిచ్‌లపై అత్యంత ప్రమాదకరంగా ఉండే అశ్విన్-జడేజా జోడీలో జడేజా స్థానాన్ని అక్షర్‌ పటేల్‌ భర్తీ చేయనున్నాడు. మూడో స్పిన్నర్ అవసరమైతే కుల్దీప్ యాదవ్‌, సౌరబ్‌ కుమార్‌లలో ఒకరు తుదిజట్టులో చోటు దక్కించుకోనున్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌-ఏతో జరిగిన 2 టెస్ట్‌ల సిరీస్‌లో భారత-ఏ తరఫున 15 వికెట్లు పడగొట్టిన సౌరబ్ కుమార్ అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్‌తో కలిసి శుభ్‌మన్‌ గిల్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించనుండగా... పుజారా, కోహ్లీ, అయ్యర్‌, పంత్‌లతో కూడిన మిడిలార్డర్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. అటు.. బౌలింగ్ విభాగంలో ఉమేశ్ యాదవ్, సిరాజ్, అశ్విన్, అక్షర్‌ పటేల్ ఉన్నారు. మూడో పేసర్‌ను తీసుకోవాల్సి వస్తే ఉనద్కట్, నవ్‌దీప్ సైనీ తుదిజట్టులో చోటుదక్కించుకోనున్నారు.

అటు... 22 ఏళ్లుగా టెస్టుల్లో భారత్‌పై విజయం సాధించాలని బంగ్లా ఆరాటపడుతూనే ఉంది. స్వదేశంలోనూ ప్రత్యర్థులకు అడ్డుకట్ట వేసే బౌలర్లు ఆ జట్టుకు లేకపోవడం పెద్ద ఎదురుదెబ్బగా మారింది. పేసర్లు టస్కిన్ అహ్మద్, ఎబాదత్ హాసన్, షోరిపుల్ ఇస్లాంతోపాటు స్పిన్నర్లు షకీబ్, తైజుల్ ఇస్లాం తుదిజట్టులో ఉండనున్నారు.

కెప్టెన్ షకీబ్, కీపర్ ముష్పీకర్ రహీంతోపాటు మోమినుల్ హాక్‌లతో కూడిన బ్యాటింగ్ విభాగం పటిష్ఠంగానే ఉంది. చిట్టగాంగ్ వేదికగా ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

మ్యాచ్‌లు ఇలా..మొదటి టెస్టు మ్యాచ్‌: డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 18 వరకు

రెండో టెస్టు మ్యాచ్‌: డిసెంబర్‌ 22 నుంచి డిసెంబర్ 26 వరకు

జట్ల వివరాలు:

భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్, రిషభ్‌ పంత్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, అభిమన్యు ఈశ్వరన్, నవ్‌దీప్‌ సైని, సౌరభ్‌ కుమార్, జయ్‌దేవ్‌ ఉనద్కత్

బంగ్లాదేశ్‌: మహముదుల్‌ హసన్, నజ్ముల్ హోస్సేన్, మోమినల్‌ హక్, యాసిర్‌ అలీ, ముష్ఫికర్‌ రహీమ్, షకిబ్ అల్ హసన్ (కెప్టెన్), లిటన్ దాస్, నురుల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ఖలిద్‌ అహ్మద్, ఎబాడట్‌ హోస్సేన్, షోరిఫుల్ ఇస్లామ్, జకీర్ హసన్, రేజార్‌ రెహ్మాన్, అనముల్‌ హక్‌

ఇదీ చూడండి:IND VS BAN: గాయపడ్డ కెప్టెన్​​.. ఆంబులెన్స్​లో ఆస్పత్రికి తరలింపు​

ABOUT THE AUTHOR

...view details