దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టు జట్టులో స్థానం సంపాదించుకున్న శుభ్‌మన్ గిల్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే వెనుదిరిగినా .. రెండో ఇన్నింగ్స్‌లో పట్టుదలగా ఆడి శతకం పూర్తి చేసుకున్నాడు. 147 బంతుల్లోనే అతడు మూడంకెల స్కోరును అందుకున్నాడు. టెస్టుల్లో అతడికిదే తొలి శతకం కావడం విశేషం. ఈ సంవత్సరం టెస్టుల్లో సెంచరీ బాదిన తొలి భారత ఓపెనర్‌గా నిలిచాడు. మొత్తం 152 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 110 పరుగులు చేశాడు. మెహదీ వేసిన 50వ ఓవర్‌లో తొలి బంతికి సిక్సర్ బాదిన గిల్.. అదే ఓవర్‌లో మూడో బంతికి హసన్ జాయ్ (సబ్‌స్టిట్యూట్)కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో గిల్ ఇన్నింగ్స్‌కి తెరపడింది.
శుభమన్ గిల్ 2020 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో (45), రెండో ఇన్నింగ్స్‌లో (35) పరుగులు చేశాడు. ఇప్పటివరకు 12 వన్డేలు ఆడి 709 పరుగులు చేయగా.. 15 వన్డేల్లో 687 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లోకి గిల్ ఇంకా అరంగేట్రం చేయలేదు. ఈ 23 ఏళ్ల ఆటగాడు ఇదే ఫామ్‌ని కొనసాగిస్తే టెస్టుల్లో రోహిత్ శర్మకి జోడీగా కేఎల్ రాహుల్ (KL Rahul)కి బదులు గిల్‌ని తీసుకునే అవకాశాలున్నాయి. ఎందుకంటే గత కొన్నాళ్లుగా మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ విఫలమవుతున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా తొలి ఇన్నింగ్స్‌లో (22), రెండో ఇన్నింగ్స్‌లో (23) పరుగులే చేసి నిరాశపర్చాడు. తర్వాతి మ్యాచ్‌ల్లో కూడా కేఎల్ విఫలమైతే అతడి ఓపెనింగ్ స్థానం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.