Ind Vs Ban Asia Cup :ఆసియా కప్‌లో భాగంగా శుక్రవారం జరిగిన భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్‌లో టీమ్ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. ఫైనల్స్‌కు ముందు జరిగిన ఈ నామమాత్రపు మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లు అద్భుతంగా రాణించారు. దీంతో 266 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. 259 పరుగులకే చేతులెత్తేసింది. ఈ క్రమంలో తాజాగా తమ ఓటమిపై టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తుందని తెలిసినప్పటికీ.. తన జట్టును పరీక్షించుకోవడానికి ఈ మ్యాచ్‌ను వినియోగించుకున్నట్లు రోహిత్ తెలిపాడు.
"రిజర్వ్ బెంచ్‌పై ఉన్న ప్లేయర్లను పరీక్షించేందుకు ఈ మ్యాచ్‌ను వాడుకున్నాం. మరి కొద్ది రోజుల్లో జరగనున్న మెగా టోర్నీను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాం. అయితే, ఈ మ్యాచ్‌ను ఆడే విషయంలో మాత్రం మేం ఎలాంటి రాజీ పడలేదు. ప్రపంచ కప్ జట్టులోని మిగతా ఆటగాళ్లకూ ఈ మ్యాచ్‌లో అవకాశం ఇచ్చాం. లోయర్ ఆర్డర్‌లో అక్షర్ పటేల్ అదరగొట్టాడు. అయితే, మ్యాచ్‌ను గెలిపించలేకపోయినప్పటికీ అతను తీవ్రంగా ప్రయత్నించాడు. బంగ్లాదేశ్ బౌలర్లను అభినందించాలి. చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. శుభ్‌మన్ గిల్ సెంచరీతో అలరించినప్పటికీ మేం విజయాన్ని సాధించలేకపోయాం. గిల్ తన మునుపటి ఫామ్‌ను అందుకోవడం బాగుంది. జట్టు కోసం ఎప్పుడు ఎలా ఆడాలనేది గిల్‌కు బాగా తెలుసు. కొత్త బంతిని చాలా చక్కగా ఎదుర్కొంటాడు. నెట్స్‌లోనూ తీవ్రంగా కష్డపడతాడు" అంటూ గిల్‌తో పాటు బంగ్లా బౌలర్లను కొనియాడాడు.
'వాళ్లు అద్భుతం చేశారు'
India Vs Bangladesh : తమ జట్టు విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన బంగ్లా కెప్టెన్ షకిబ్ అల్ హసన్.. మ్యాచ్‌లో తమ స్పిన్నర్లు రాణించిన తీరును కొనియాడాడు. ప్రపంచకప్‌లో తమ జట్టు ప్రమాదకారిగా మారతుందంటూ చెప్పుకొచ్చాడు.