Ind Vs Ban Asia Cup Records :ఆసియా కప్‌లో భాగంగా జరిగిన భారత్ - బంగ్లాదేశ్ సూపర్ 4 మ్యాచ్‌లో రోహిత్ సేన అనూహ్యంగా ఓటమిపాలైంది. హోరా హోరీగా జరిగిన ఈ మ్యాచ్ ఓటమితో ఆసియా కప్‌లో టీమ్ఇండియాకు తొలి పరాజయం ఎదురైంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లు రాణించడం వల్ల 259 పరుగులకే భారత జట్టు తేలిపోయింది. బంగ్లా బౌలర్లలో ముస్తఫిజుర్ 3 వికెట్లు తీయగా... అరంగేట్ర బౌలర్ తన్‌జీమ్, మెహదీ హసన్ చెరో 2 వికెట్లు తీసి టీమ్ఇండియాకు చుక్కలు చూపించారు.
ఇతర బ్యాటర్ల నుంచి ఎలాంటి సహకారం లేకున్నప్పటికీ శుభ్‌మన్‌గిల్ తన శతకంతో టీమ్‌ఇండియా గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. 121 పరుగులతో అద్భుతంగా రాణించినప్పటికీ.. అతని పోరాటం వృథా అయిపోయింది. ఇక అక్షర్ పటేల్ సైతం చివర్లో గొప్పగా పోరాడాడు. కానీ అవేవీ జట్టును గెలిపించేందుకు సరిపోలేదు. దీంతో ఇప్పటికే ఆసియాకప్ ఫైనల్ చేరిన టీమ్‌ఇండియాకు నామమాత్ర మ్యాచ్‌లో పరాజయం తప్పలేదు. అయితే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు అనేక రికార్డులను నెలకొల్పాయి. ఇంతకీ అవేంటంటే..
- భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బంగ్లా కెప్టెన్ షకిబ్ అల్ హసన్ కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు అతను టీమ్‌ఇండియాపై 29 వికెట్లు పడగొట్టాడు.
- భారత్‌తో జరిగిన గత నాలుగు మ్యాచుల్లో బంగ్లాదేశ్ మూడింటిని గెలిచింది. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే ఓటమిపాలైంది.
- వివిధ దేశాలు పాల్గొనే వన్డే టోర్నీల్లో భారత్‌పై మూడు మ్యాచుల్లోనూ బంగ్లాదేశ్ విజయం సాధించింది. 2007 వరల్డ్ కప్‌లో ఐదు వికెట్ల తేడాతో, 2012 ఆసియా కప్‌లో ఐదు వికెట్ల తేడాతో, తాజాగా జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లోనూ ఆరు పరుగుల తేడాతో బంగ్లా గెలిచింది.
- టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది వన్డేల్లో 1000కిపైగా పరుగులు సాధించాడు. అలాగే ఒకే ఏడాదిలో ఆరో శతకాన్ని బాదాడు. 32 వన్డేల తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా గిల్ చరిత్రకెక్కాడు. ప్రస్తుతం తన ఖాతాలో 1,712 పరుగులు ఉండగా.. ఈ రికార్డుతో గిల్.. సీనియర్ ప్లేయర్ హషీమ్ ఆమ్లా (1,650)ను వెనక్కి నెట్టాడు.