Ind Vs Ban Asia Cup : ఆసియా కప్ సూపర్- 4లో భాగంగా జరగనున్న చివరి పోరుకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే పాకిస్థాన్, శ్రీలంకపై విజయాలతో ఫైనల్స్‌కు చేరిన రోహిత్ సేన.. శుక్రవారం బంగ్లాదేశ్‌తో మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా తమ జట్టులో కీలక మార్పులు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పని భారం దృష్ట్యా కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి.. ఇతర క్రికెటర్లను పరీక్షించే అవకాశాలు కూడా ఉన్నాయి. రానున్న ప్రపంచకప్ నేపథ్యంలో ఈ పరిణామాలు జరగనున్నాయి. మరోవైపు సూపర్- 4లో పాక్, శ్రీలంకపై ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన బంగ్లాదేశ్.. ఈ టోర్నీని గెలుపుతో ముగించాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా జట్టు.. బంగ్లాను తేలిగ్గా తీసుకోకూడదంటూ విశ్లషకులు అభిప్రాయపడుతున్నారు.
శ్రేయస్.. ఈ మ్యాచ్‌కైనా..
Shreyas Iyer Asia Cup : ఇక క్రికెట్ లవర్స్‌కు.. బంగ్లాదేశ్‌తో పోరు కంటే కూడా ఈ మ్యాచ్‌లో శ్రేయస్ ఆడతాడా లేదా అన్న విషయంపై ఎక్కువగా ఆసక్తి నెలకొంది. వెన్నునొప్పికి కారణంగా క్రికెట్‌కు దూరమైన ఈ స్టార్ ప్లేయర్.. శస్త్రచికిత్స నుంచి కోలుకున్నాక తిరిగి ఆసియా కప్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. పాకిస్థాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 14 పరుగులు చేశాడు. అయితే నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అతనికి బ్యాటింగ్ చేసే అవసరమే రాలేదు. ఆ తర్వాత వెన్ను నొప్పి కారణంగా సూపర్- 4లో రెండు మ్యాచ్‌లకూ దూరమయ్యాడు.
అయితే ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు కనిపిస్తున్న శ్రేయస్.. బంగ్లాతో జరగనున్న మ్యాచ్‌లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెట్స్‌లోనూ అతను సౌకర్యవంతంగానే బ్యాటింగ్ చేశాడు. ఇక శ్రేయస్ వస్తే.. ఇషాన్ కిషన్ బెంచ్‌కు పరిమితమవ్వక తప్పదు. మరోవైపు బౌలర్ల విషయంలోనూ టీమ్‌ఇండియా మార్పులు చేసేలా కనిపిస్తోంది.