IND Vs AUS World Cup Final 2023 Cummins Shami :2023 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం జరిగే ఫైనల్ సమరంలో భారత్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు- బీసీసీఐ కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తమకు సవాలుగా మారే అవకాశం ఉందని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. అంతేకాకుండా ఈ వరల్డ్ కప్‌లో షమీ చేసిన ప్రదర్శనను కొనియాడాడు. ఈ మేరకు ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో కమిన్స్ మాట్లాడాడు.
"టీమ్ఇండియా అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉంది. టోర్నమెంట్ ప్రారంభంలో ఆడని ఓ ప్లేయర్ ఆ తర్వాత అద్భుత ప్రదర్శన చేశాడు. రైట్, లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్లకు షమీ ఒక క్లాస్ బౌలర్. కాబట్టి అతడు మాకు సవాలు కాబోతున్నాడు. అయితే మా బ్యాటర్లందరూ ఈ బౌలర్లను ఆల్రెడీ ఫేస్ చేసి మంచి ప్రదర్శన చేశారు. ఇండియా టీమ్‌లో ఐదుగురు బౌలర్లు ఉన్నారు. వారు ప్రతి మ్యాచ్‌లో 10 ఓవర్ల చొప్పున బౌలింగ్ చేశారు. అందులో ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో స్పన్నర్లు బాగా రాణించారు. ఇక ఎప్పటిలాగే కుల్దీప్, జడేజా నుంచి మాకు కఠినమైన సవాలు ఎదురుకాబోతోంది. వారు (టీమ్ఇండియా) ఈ వరల్డ్ కప్‌లో ప్రతి గేమ్ గెలిచి ఆకట్టుకున్నారు"
--పాట్ కమిన్స్, ఆస్ట్రేలియా కెప్టెన్