Ind Vs Aus Women Test Healy : ముంబయి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు దుమ్ముదులిపేసింది. ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ జట్టుపై భారత మహిళా జట్టుకు మొట్టమొదటి టెస్టు గెలుపు ఇదే కావడం విశేషం. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు కెప్టెన్ అలీసా హీలీ మాత్రం తన చర్యతో అభిమానుల మనసును గెలుచుకుంది.
ఏం జరిగిందంటే?
ఆసీస్‌పై చరిత్రాత్మక విజయం తర్వాత భారత మహిళల జట్టు సంబరాల్లో మునిగిపోయింది. ఆ సమయంలో ట్రోఫీని అందుకున్న భారత జట్టు ఛాంపియన్స్ హోర్డింగ్ వెనక ఉండి ఫొటోలకు పోజులు ఇచ్చింది. ఈ క్రమంలో అలీసా హీలీ ఫోటోగ్రాఫర్ అవతారం ఎత్తింది. భారత జట్టు విన్నింగ్ మూమెంట్స్‌ను కెమెరాలో బంధించింది హీలీ. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓడిపోయినప్పటికీ అలీసా హీలీ క్రీడా స్ఫూర్తికి అభిమానులు ఫిదా అయిపోయారు. హీలీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఓడినా మనుసులు గెలిచేసేవంటూ కామెంట్లు పెడుతున్నారు.
మ్యాచ్ వివరాలు ఇలా
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకు ఆలౌటైంది. అనంతరం టీమ్ఇండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 406 పరుగులు సాధించింది. దీంతో భారత్ 187 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 74 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 261 పరుగులకు ఆలౌటైన ఆసీస్, భారత్ ముందు 74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. 75 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.