Ind vs Aus Wolrd Cup Final 2023 :2023 ప్రపంచకప్ మహా సంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో.. రెండుసార్లు టోర్నీ విజేత భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం (నవంబర్ 19) మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది.
మేం బ్యాటింగ్ చేయాలనుకున్నాం: రోహిత్
టాస్ నెగ్గితే మేం తొలుత బ్యాటింగ్ చేయాలని భావించాం. పిచ్ చాలా బాగుంది. స్కోరు బోర్డుపై భారీగా పరుగులు ఉంచేందుకు ప్రయత్నిస్తాం. క్రికెట్‌లోనే గొప్ప సందర్భం. ఫైనల్‌లో కెప్టెన్సీ చేయాలనే కల సాకారమైంది. గత పది మ్యాచుల్లో ఎలాంటి ఆటతీరును ప్రదర్శించామో ఈ మ్యాచ్‌లోనూ ఆడతాం.
మా దృష్టి అంతా దానిపైనే: బుమ్రా
చివరి వరకూ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంపైనే మేం దృష్టిపెట్టాం. స్టేడియంలో వాతావరణం అద్భుతంగా ఉంది. అభిమానులు, కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచేందుకు వచ్చారు. స్వదేశంలో ఆడేటప్పుడు ఫ్యాన్స్ సపోర్ట్ అద్భుతం.
మ్యాచ్ టై అయితే పరిస్థితేంటి?
భారత్-ఆసీస్ మధ్య ఫైనల్ మ్యాచ్ సర్వం సిద్ధమైంది. ఒకవేళ ఇరు జట్ల స్కోర్లు సమమైతే అప్పుడు ‘టై’ అవుతుంది. ఇలాంటి సమయంలో మ్యాచ్ ఫలితాన్ని గత వరల్డ్ కప్ ఫైనల్ మాదిరిగా బౌండరీలను లెక్కకట్టి విజేతను ప్రకటించడం జరగదు. గతంలో మాదిరిగానే సూపర్ ఓవర్‌ను ఆడిస్తారు. అయితే, ఆ సూపర్ ఓవర్ కూడా టైగా ముగిస్తే.. విజేత తేలే వరకూ సూపర్ ఓవర్లను కొనసాగిస్తూనే ఉంటారు. అలాగే ఫైనల్ మ్యాచ్ కోసం అదనంగా 120 నిమిషాలను కేటాయించడం జరిగింది. అనుకోని సంఘటనల వల్ల మ్యాచ్ ఆలస్యమైనా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకే ఐసీసీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది.