టీమ్ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు వరల్డ్ క్లాస్ బ్యాటర్ మాత్రమే కాదు.. మంచి ఫన్ ఎంటర్టైనర్ కూడా. అప్పుడప్పుడు ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌తో కామెడీ చేయడం, డ్యాన్స్‌లు వేయడం చేస్తూ ఎంటర్టైన్ చేస్తుంటాడు. వాటిని సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటుంటాడు. అలానే ఫీల్డ్‌లోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ.. తన బాడీ లాంగ్వేజ్, హావాభావాలు, డ్యాన్స్‌లతో ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూ ఉంటాడు. గతంలోనూ చాలా సార్లు మైదానంలో ఇలాంటివి చేశాడు. అయితే ఇప్పుడు మరోసారి తనదైన స్టైల్లో గ్రౌండ్లో స్టెప్పులేసి అభిమానులను ఆకట్టుకున్నాడు. తాజాగా చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డే ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లీ గ్రౌండ్లో డ్యాన్స్ వేశాడు. బౌండరీ రోప్ వద్ద 'చెన్నై ఎక్స్‌ప్రెస్' మూవీలోని లుంగీ డ్యాన్స్ పాటకు స్టెప్పులు వేశాడు. దీనికి సబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనికి తెగ లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.
కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగింది. రెండు మార్పులతో బరిలోకి దిగిన ఆసీస్.. తొలి రెండు వన్డేలకు అందుబాటులో లేని ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను జట్టులోకి తీసుకుంది. స్పిన్నర్ ఆగర్‌ను కూడా తుది జట్టులో అవకాశం కల్పించింది. ఇకపోతే ఈ సిరీస్‌లో అంతగా రాణించని కెప్టెన్ రోహిత్ శర్- విరాట్ కోహ్లీని ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. వీరిద్దరూ కలిసి మరో 2 రన్స్ సాధిస్తే.. వన్డేల్లో అత్యంత వేగంగా 5 వేల పరుగులు పూర్తి చేసిన జంటగా నిలవనున్నారు.