టీమ్ఇండియాతో మూడు వన్డేల సిరీస్ ఆస్ట్రేలియాదే. బుధవారం జరిగిన చివరి మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో గెలిచిన కంగారూలు 2-1తో సిరీస్ పట్టేశారు. అయితే మ్యాచ్ అనంతరం భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. తమ జట్టు ఓటమిపై స్పందించాడు. తాము బ్యాటింగ్ వైఫల్యంతోనే చివరి వన్డేలో ఓటమిపాలయ్యామని రోహిత్ శర్మ తెలిపాడు. ఆసీస్ విధించిన లక్ష్యం గొప్పదేం కాదని.. కానీ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో తమ బ్యాటర్లు విఫలమయ్యారని తెలిపాడు. కనీసం ఒక్క బ్యాటర్ నిలిచినా మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకుంటామని తెలిపాడు.
"ఆసీస్ నిర్దేశించిన లక్ష్యం గొప్పదేం కాదు. మేమే సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. ఛేజింగ్‌లో భాగస్వామ్యాలు చాలా కీలకం. ముఖ్యంగా మ్యాచ్‌లో మేము సరైన పార్ట్‌నర్‌షిప్స్ నమోదు చేయలేకపోయాం. మంచి ఆరంభం లభించిన తర్వాత.. ఒక బ్యాటర్ క్రీజులో నిలబడి వీలైనంత వరకు మ్యాచ్‌ను డీప్‌గా తీసుకెళ్లడం చాలా ముఖ్యం. కానీ అలా చేయలేకపోయాం. వరుసగా వికెట్లు కోల్పోవడం మా విజయవకాశాలను దెబ్బతీయడంతో పాటు మా బ్యాటర్లపై ఒత్తిడి పెంచింది. ఈ సిరీస్ కోల్పోయినా.. గత 9 వన్డేల్లో మాకు ఎన్నో సానుకూలంశాలు లభించాయి. ఈ ఓటమితో మేము ఎక్కడ మెరుగుపడాలో అనే విషయం తెలిసింది. ఇది సమష్టి వైఫల్యం. ఈ సిరీస్‌లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఆస్ట్రేలియా ప్లేయర్లు అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా ఆసీస్ స్పిన్నర్లు ఇద్దరూ మాపై ఒత్తిడి పెంచారు. పేసర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ విజయానికి వారు పూర్తిగా అర్హులు" అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.