Ind vs Aus ODi 2023 :ఇందౌర్ హోల్కర్ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టీమ్ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 50 ఓవర్లలో టీమ్ఇండియా 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లు.. శుభ్‌మన్ గిల్ (104), శ్రేయస్ అయ్యర్ (105) శతకాలతో చెలరేగిన వేళ.. కెప్టెన్ కేఎల్ రాహుల్ (52), సూర్యకుమార్ యాదవ్ (72*) అర్ధశతకాలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2, జోష్ హజెల్‌వుడ్, సీన్ అబాట్, ఆడమ్ జంపా తలో వికెట్ పడగొట్టారు. ఇక వన్డేల్లో ఆసీస్‌పై.. భారత్‌కు ఇదే అత్యధిక స్కోర్. ఇంతకు ముందు 2013లో బెెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో భారత్ 383 పరుగులు చేసింది. అదే మ్యాచ్‌లో ప్రస్తుత టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ(209) .. తొలి డబుల్ సెంచరీ సాధించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనె ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్ సెన్సేషన్ రుతురాజ్ గైక్వాడ్ (8) పరుగులకే ఔటయ్యాడు. ఇక ఆసీస్ బౌలర్లకు అవే చివరి సంబరాలు అయ్యాయి. వన్ డౌన్లో క్రీజులకి వచ్చిన అయ్యర్.. గిల్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ సెంచరీలు పూర్తి చేశారు. ఇక రెండో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో భారత్ తరఫున రెండో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన ఆటగాళ్లలో ఈ జోడీ చేరింది.
మరోవైపు కెప్టెన్ రాహుల్ కూడా.. తన ఫామ్‌ను కొనసాగించాడు. ఆసియా కప్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చిన అతడు.. నిలకడగా ఆడుతున్నాడు. ఇదే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన రాహుల్.. ఇందౌర్‌లో కూడా అర్ధ శతకం నమోదు చేశాడు. ఇక పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ (31 పరుగులు: 18 బంతులు, 2x4, 2x6) .. వేగంగా ఆడే క్రమంలో జంపాకు వికెట్ సమర్పించుకున్నాడు.