తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్Xఆస్ట్రేలియా ఫైనల్​ - ఇట్స్ రివెంజ్ టైమ్! - ఆసీస్​ను కొట్టాల్సిందే - భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్​కప్ 2023

ind vs Aus Final World Cup 2023 : 2023 వరల్డ్​కప్​ ట్రోఫీ ముద్దాడేందుకు భారత్, ఆస్ట్రేలియా ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాయి. అయితే గతంలో ఇరుజట్లు ఐసీసీ ఈవెంట్ నాకౌట్​ మ్యాచ్​ల్లో 7 సార్లు తలపడగా.. టీమ్ఇండియాదే పైచేయి. కానీ, గెలిచిన మూడు విజయాల్లో ఆసీస్ ఎక్కువ ప్రభావం చూపింది.

ind vs aus final world cup 2023
ind vs aus final world cup 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2023, 11:00 AM IST

ind vs Aus Final World Cup 2023 :2023 వరల్డ్​కప్ టోర్నీలో ఒకే ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. ఫైనల్​లో తలపడే జట్లేవో కూడా తెలిసిపోయింది. టైటిల్ పోరులో భారత్ - అస్ట్రేలియా నవంబర్ 19న అహ్మదాబాద్​ వేదికగా అమీతుమి తేల్చుకోనున్నాయి. విశ్వకప్ విజేతగా నిలిచేందుకు​ ఇరు జట్లు ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాయి. ఆతిథ్య భారత్ ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి కాగా.. ఆసీస్​ ఎనిమిదో ఫైనల్ ఆడనుంది. అయితే ఐసీసీ ఈవెంట్​ నాకౌట్​ మ్యాచ్​ల్లో ఇరుజట్లు 7 సార్లు తలపడగా.. భారత్​దే పైచేయి. కానీ, ఆసీస్ నమోదు చేసిన మూడు విజయాలను టీమ్ఇండియా ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అంతలా ప్రభావం చూపిన ఆ మూడు విజయాలేవంటే?

అప్పుడు భంగపడ్డ భారత్..సరిగ్గా 20 ఏళ్ల కింద, 2003 వరల్డ్​కప్ ఫైనల్​లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. అప్పుడు ఆసీస్​ కెప్టెన్​గా రికీ పాంటింగ్ ఉండగా.. సౌరభ్ గంగూలీ భారత్​కు నాయకత్వం వహించాడు. తొలుత బ్యాటింగ్​ చేసిన ఆసీస్.. భారత్ ముంగిట 360 పరుగులు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో భారత్.. 39.2 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటై, రన్నరప్​తో సరిపెట్టుకుంది.

2015లో ఇలా.. 2015 ప్రపంచకప్​లో అత్యంత సక్సెస్​ఫుల్​ జట్టుగా నిలిచిన భారత్.. క్వార్టర్స్​లో బంగ్లాదేశ్​ను ఓడించి భారత్ సెమీస్​కు దూసుకెళ్లింది. కానీ, సెమీస్​లో ఆసీస్​ను ఢీకొట్టిన భారత్.. అనూహ్యంగా ఓడి ఇంటిబాట పట్టింది. ఈ మ్యాచ్​లో 329 పరుగుల లక్ష్యంతో బరిలోకి భారత్.. 233 పరుగులకు ఆలౌటైంది. ఈ ఎడిషన్​ ట్రోఫీని ఆసీస్ గెలిచింది.

2023లోనూ తప్పని ఓటమి.. ఇదే ఏడాది జూన్​లో జరిగిన.. 2021-23 వరల్డ్​టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్లోనూ భారత్ ప్రత్యర్థి ఆస్ట్రేలియానే. ఈ మ్యాచ్​లోనూ ఆసీస్​ చేతిలో భారత్​కు పరాభవం తప్పలేదు. తొలి ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా రెండు ఇన్నింగ్స్​లో వరుసగా (469, 270-8) నమోదు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్​లో 296 పరుగులకు ఆలౌటైన భారత్.. 444 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఛేదనలో టీమ్ఇండియా 234 పరుగులకే పరిమితమైంది. దీంతో 203 పరుగుల తేడాతో నెగ్గిన ఆసీస్.. టెస్టు ఛాంపియన్​షిప్​ గథ ఎగరేసుకుపోయింది.

ఈసారి మిస్​ అవ్వకూడదు.. రెండుసార్లు ప్రపంచకప్​, ఒకసారి డబ్ల్యుటీసీ 2021-23 టోర్నీలో భారత్​ను నాకౌట్​ మ్యాచ్​ల్లో దెబ్బకొట్టిన ఆసీస్​పై రివెంజ్ తీర్చుకోవాలన్న కసితో ఉంది టీమ్ఇండియా. ఈసారి ఎలాగైనా ఫైనల్​లో ఆసీస్​ను ఓడించి.. ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడాలని రోహిత్ సేన భావిస్తోంది.

  • ఐసీసీ ఈవెంట్​ నాకౌట్​ మ్యాచ్​ల్లో భారత్ - ఆస్ట్రేలియా ఫలితాలు
సంవత్సరం ఈవెంట్ నాకౌట్ మ్యాచ్ విజేత
1998 ఛాంపియన్స్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ భారత్
2000 ఛాంపియన్స్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ భారత్
2003 ప్రపంచకప్​ ఫైనల్ ఆస్ట్రేలియా
2007 టీ20 వరల్డ్​కప్ సెమీ ఫైనల్ భారత్
2011 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ భారత్
2015 ప్రపంచకప్ సెమీ ఫైనల్ ఆస్ట్రేలియా
2023 డబ్ల్యూటీసీ ఫైనల్ ఆస్ట్రేలియా

ఇదే తొలిసారి.. ఏడాదిలో రెండు ఐసీసీ ఈవెంట్ ఫైనల్స్​లో ఒకే ప్రత్యర్థులు తలపడడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియాదే విజయం - ఎనిమిదోసారి ఫైనల్స్​కు ఆసీస్

షమీ @ 7 - కివీస్​ను దెబ్బకు దెబ్బ కొట్టిన రోహిత్ సేన - ఫైనల్స్​కు భారత్

ABOUT THE AUTHOR

...view details