Ind vs Aus Final 2023 :అహ్మదాబాద్.. నరేంద్ర మోదీ స్టేడియం వేదిక ఆదివారం టీమ్ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ 2023 ఫైనల్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు విశ్వ విజేత ఎవరా అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌ల్లో భారత్, ఆస్ట్రేలియా చేసిన పెర్ఫార్మెన్స్లపై ఓ లుక్కేద్దాం.
కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నమెంట్‌ల్లో టీమ్ఇండియాకు నిరాశ ఎదురవుతోంది. ఇలాంటి టోర్నీల్లో లీగ్ దశలో భారత్ బాగానే ఆడుతున్నా.. నాకౌట్/ ఫైనల్స్‌కు వచ్చేసరికి విఫలమవుతున్నాయి. అయితే ఈ సారి మాత్రం టీమ్ఇండియా లీగ్ స్టేజ్‌లో, సెమీ ఫైనల్స్‌లో అప్రతిహతంగా దూసుకెళ్లింది. వరుసగా 10 మ్యాచ్‌లో విజయం సాధించింది. అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసింది. అయితే గత వరల్డ్ కప్‌ల్లో టీమ్ఇండియా చేసిన అత్యుత్తమ ప్రదర్శనలను పరిశీలిద్దాం.
ముచ్చటగా మూడోసారి ముద్దాడాలని..
1975లో జరిగిన తొలి వరల్డ్ కప్ ఎడిషన్‌లో భారత్ పేలవ ప్రదర్శ చేసింది. ఆ తర్వాత 1979లో జరిగిన ప్రపంచ కప్‌లోనూ అదే తీరు కొనసాగించింది. అయితే 1983లో జరిగిన వరల్డ్ కప్‌లో మెన్ఇన్ బ్లూ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచింది. కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమ్ఇండియా.. మొదటి రెండు వరల్డ్ కప్‌లు గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న వెస్టిండీస్‌ను ఫైనల్లో మట్టికరిపించింది. అంతుకుముందు లీగ్ స్టేజ్‌లోనూ కరీబియన్లపై విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో 54.4 ఓవర్లలో టీమ్ఇండియా 183 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అయితే ఆ తర్వాత తమ పటిష్ఠమైన బౌలింగ్‌తో వెస్టిండీస్s 140 పరుగులకే కట్టడిచేసింది. అలా మొదటి వరల్డ్ కప్‌ను ముద్దాడింది.
అయితే 20 ఏళ్ల తర్వాత (వరల్డ్ కప్ ఫైనల్ ఆస్ట్రేలియా, జోహన్నెస్‌బర్గ్) టీమ్ఇండియాకు మరోసారి జగజ్జేతగా నిలిచే అవకాశం వచ్చింది. ఆస్ట్రేలియాతో ఫైనల్లో తలపడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. 360 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 234 పరుగులకే ఆలౌట్ అయి 125 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది.
ఆ తర్వాత 8 ఏళ్లకు 2011లో టీమ్ఇండియా మరోసారి వరల్డ్ కప్ టైటిల్ గెలిచే అవకాశం వచ్చింది. భారత్, శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన లంక.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. 275 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా.. ఆరంభంలోనే 31 పరుగులకే వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ తెందూల్కర్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన గంభీర్ (97), ధోనీ (91) అద్భతంగా రాణించారు. దీంతో 28 ఏళ్ల తర్వాత భారత్ రెండోసారి వరల్డ్ కప్‌ను ముద్దాడింది. ఇక ఈసారి ఆస్ట్రేలియాను చిత్తు చేసి మూడో సారి జగజ్జేతగా నిలుస్తుందో లేదో అన్నది కాలమే నిర్ణయిస్తుంది.