Ind vs Aus 1st ODI 2023 :భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్లన్నీ ఆడిన ఆసీస్ 276 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (52), స్టీవ్ స్మిత్ (41), మార్నస్ లబుషేన్ (39), జోష్ ఇంగ్లిస్ (45), కామెరూన్ గ్రీన్ (31) రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 5, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు.
టాస్ గెలిచిన భారత్.. ప్రత్యర్థికి ముందుగా బ్యాటింగ్ అప్పజెప్పింది. ఇక తొలి ఓవర్లలోనే షమీ.. ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్ (4)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన స్మిత్.. మరో ఓపెనర్ వార్నర్‌తో కలిసి మంచి (94 పరుగులు) భాగస్వామ్యం నెలకొల్పారు. డేంజర్‌గా మారుతున్న ఈ జోడీని స్పిన్నర్ రవీంద్ర జడేజా విడగొట్టి.. టీమ్ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. అతడు వార్నర్‌ను ఔట్ చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన లబుషేన్, గ్రీన్, ఇంగ్లిస్ సమష్టి కృషితో స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. చివర్లో స్టోయినిస్ (29 పరుగులు , 5x4), కెప్టెన్ కమిన్స్ (21 పరుగులు : 9 బంతుల్లో, 2x4, 1x6) వేగంగా ఆడటం వల్ల ఆసీస్ 250+ మార్క్‌ను దాటగలిగింది. ఇక భారత బౌలర్ శార్దూల్ ఠాకూర్ ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసి.. వికెట్ లేకుండా 7.80 ఎకనమీతో 78 పరుగులు సమర్పించుకున్నాడు.
వార్నర్@100..ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇన్నింగ్స్ 12 ఓవర్లో వార్నర్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో అతడు వన్డేల్లో 100 సిక్స్‌ల మైలురాయి అందుకున్నాడు. ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన 43వ బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. వార్నర్ ఈ ఘనతను 148 మ్యాచ్‌ల్లో సాధించాడు.