Ind vs Afg World Cup 2023 :కోట్లాది అభిమానుల అంచనాలను మోస్తూ.. ప్రపంచకప్‌లో అడుగుపెట్టింది భారత్. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ కొంత ఇబ్బందిపడ్డా.. చివరికి విజయం సాధించింది. ఇక ఈ జోష్‌లో టీమ్ఇండియా.. టోర్నీలో రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 11 బుధవారం అఫ్గానిస్థాన్‌తో, భారత్ తలపడనుంది. అయితే అఫ్గాన్‌తో పోరు తర్వాత.. అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియాకు ప్రస్తుత మ్యాచ్.. శనివారం నాటి మహా సమరానికి ప్రాక్టీస్‌గా ఉపయోగపడుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వారు ఛాన్స్‌ను వినియోగించుకుంటారా? టీమ్ఇండియా యంగ్ సంచలనం శుభ్‌మన్ గిల్జట్టుకు దూరం కావడం వల్ల.. అతడి స్థానంలో ఇషాన్‌కు తుది జట్టులో చోటు దక్కింది. అయితే ఆసీస్‌తో మ్యాచ్‌లో ఇషాన్.. ఎదుర్కున్న తొలి బంతినే ఎటాకింగ్ మోడ్‌లో ఆడబోయి సెకండ్ స్లిప్‌లో దొరికిపోయాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే ఇషాన్ పెవిలియన్ చేరి.. తీవ్రంగా నిరాశపర్చాడు. ఇక రీసెంట్గా ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన శ్రేయస్ అయ్యర్.. తొలి మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే వీరిద్దరూ. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో అయినా.. మంచి ఇన్నింగ్స్‌తో రాణించాలని టీమ్ఇండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
రోహిత్ గాడిన పడేనా.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. తొలి మ్యాచ్‌లో సున్నా చుట్టేశాడు. పసికూన అఫ్గాన్‌పై అయినా.. బ్యాట్ ఝళిపించి భారీ స్కోర్ చేసి, పాక్‌తో మ్యాచ్‌కు ముందు టచ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది.