Ind vs Afg 1st T20:మూడు టీ20ల సిరీస్ తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో నెగ్గింది. అఫ్గానిస్థాన్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శివమ్ దూబే (60 పరుగులు, 40 బంతుల్లో: 5x4, 2x6) హాఫ్ సెంచరీతో అదరగొట్టాగా, జితేశ్ శర్మ (31 పరుగులు, 20 బంతుల్లో: 5x4) రాణించాడు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ రెహ్మాన్ 2, అజ్మతుల్లా ఒమర్జాయ్ 1 వికెట్ దక్కించుకున్నాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన దూబేకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో టీమ్ఇండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ జనవరి 14న జరగనుంది.
స్పల్ప లక్ష్య ఛేదనలో తొలి ఓవర్లోనే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో బంతికే కెప్టెన్ రోహిత్ శర్మ రనౌటయ్యాడు. నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌తో సమన్వయం కోల్పోయిన రోహిత్ (0) డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన తిలక్ వర్మ (26 పరుగులు)తో కలిసి గిల్ (23 పరుగులు) కాసేపు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ, ముజీబ్ వేసిన బంతికి స్టంపౌటయ్యాడు గిల్. అప్పుడు క్రీజులోకి వచ్చిన దూబే బౌండరీలతో చెలరేగిపోయాడు. తిలక్ ఔటైనా జితేశ్‌తో కలిసి దూబే ఎటాకింగ్ కొనసాగించాడు. ముజీబ్ బౌలింగ్‌లో, జితేశ్ ఇబ్రహీమ్‌కు దొరికిపోయాడు. ఆఖర్లో క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ (16* పరుగులు)తో కలిసి దూబే పని పూర్తి చేశాడు.