Rahane performance: గత కొద్దికాలంగా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న సీనియర్ బ్యాటర్లు ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానెలకు టీమ్‌ఇండియా అండగా ఉందని టీమ్‌ఇండియా కొత్త బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే అన్నాడు. టెస్టు క్రికెట్లో వాళ్లకు తగినంత అనుభవం ఉందని.. మునుపటి లయను అందుకోవడానికి ఒక్క ఇన్నింగ్స్ దూరంలోనే ఉన్నారని చెప్పాడు. గత రెండు సంవత్సరాలుగా రహానె ఫామ్ లేమితో వరుసగా విఫలమవుతున్నారు. మరోవైపు, టెస్టు స్పెషలిస్ట్ పుజారా కూడా గత 16 టెస్టుల్లో ఒక్క శతకం కూడా నమోదు చేయకుండా కొనసాగుతున్నాడు.
"టెస్టు క్రికెట్లో అజింక్య రహానె, ఛెతేశ్వర్ పుజారాలకు తగినంత అనుభవం ఉంది. వీరిద్దరూ కలిసి చాలా సార్లు కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మునుపటి లయను అందుకోవడానికి ఒక్క ఇన్నింగ్స్ దూరంలోనే ఉన్నారు. అందుకే, ఓ జట్టుగా మేమంతా వాళ్లకు అండగా నిలబడ్డాం. వారి నుంచి టీమ్ఇండియా ఏమి ఆశిస్తుందో వారికి బాగా తెలుసు. వారిద్దరూ పుంజుకుంటే మిడిలార్డర్ మరింత బలోపేతమవుతుంది" అని పరాస్ మాంబ్రే అభిప్రాయపడ్డాడు.