ప్రస్తుతం భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సిరీస్‌పై స్పందించాడు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్. ఇరు జట్ల ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనపై తన అభిప్రాయాల్ని తెలిపాడు. అవన్నీ అతడి మాటల్లోనే..
మీరెన్నో చిరస్మరణీయమైన విజయాల్లో పాలుపంచుకున్నారు. ఈ లార్డ్స్ టెస్టు విజయాన్ని ఎలా వర్ణిస్తారు?
సచిన్: ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించినప్పుడే నేను ఆశ్చర్యపోయా. అలా చేయడంతోనే టీమ్ఇండియా ఫాస్ట్ బౌలింగ్‌ను చూసి ఆ జట్టు భయపడిందని అనుకున్నా. ఈ విషయంపై శుక్రవారం ఉదయం నా మిత్రుడొకరికి మెసేజ్ చేశా. వాతావరణం అనుకూలిస్తే ఈ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందని చెప్పాను. ఎందుకంటే మ్యాచ్ జరిగేకొద్దీ ఈ పిచ్ చాలా పొడిగా అనిపించింది. సిరాజ్ కొత్త బంతితో రాబిన్సన్కు బౌలింగ్ చేసినప్పుడు బంతి వెళ్లి ఛాతికి తగిలింది. పిచ్ డ్రైగా మారిందనడానికి అదే నిదర్శనం. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలుత బౌలింగ్ చేయడం సరైన నిర్ణయం కాదు. అలాగే మన ఓపెనర్లు రోహిత్, రాహుల్ అద్భుతంగా ఆడారు.
ఈ ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ గురించి మీరేమంటారు?
సచిన్: ఈ ఇంగ్లాండ్ జట్టుకు ఒక్కసారిగా కుప్పకూలే చరిత్ర ఉంది. అక్కడే వాళ్లు వెనుబడ్డారు. ఈ జట్టులో ఎంత మంది బ్యాట్స్‌మెన్ శతకాలు సాధిస్తారని కచ్చితంగా చెప్పగలరు? నేనైతే జోరూట్ మినహా ఎవరినీ ఎంపికచేయలేను. ఇదివరకున్న జట్లలో అలిస్టర్ కుక్, మైఖేల్ వాన్, కెవిన్ పీటర్సన్, ఇయాన్ బెల్, జోనాథన్ ట్రాట్, ఆండ్రూ స్ట్రాస్ లాంటి ఆటగాళ్లు బాగా ఆడేవాళ్లు. ఇప్పుడున్న జట్టులో ఎప్పుడో ఒకసారి శతకాలు బాదినా నిలకడగా రాణించే ఆటగాళ్లు ఎవరున్నారు? అలా ఆడేవారిలో రూట్ మినహా ఎవరూ కనిపించరు. ఇప్పుడా జట్టు పరిస్థితి ఇలా ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో రూట్ తొలుత బౌలింగ్ ఎంచుకోడానికి ఇది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు.
ఈ మ్యాచ్‌లో రోహిత్ తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌పై మీ స్పందన? అలాగే అతడు తరచూ హుక్ లేదా పుల్ షాట్లకు ఔటవ్వడాన్ని ఎలా చూస్తారు?
సచిన్: నేను ఏదైతే చూసానో అదే నమ్ముతా. రోహిత్ చాలా అద్భుతంగా ఆడాడు. తన బ్యాటింగ్ టెంపర్మెంట్లోని మరో కోణాన్ని చూపించాడు. పరిస్థితులకు తగ్గట్టు తనని తాను ఎలా మలుచుకుంటాడో కూడా చాటిచెప్పాడు. అలాగే అతడికి రాహుల్ నుంచి కూడా మంచి సహకారం అందింది. ఇక పుల్ షాట్ల విషయానికొస్తే ఇదివరకే అలాంటి షాట్లతో బౌండరీలు సాధించాడు. బంతిని ఎలా ఆడాలి, ఎలా వదిలేయాలనే విషయాలపైనా మంచి నైపుణ్యం సాధించాడు. అలాగే ఇంగ్లాండ్‌లో ఇటీవల అతడు ఆడుతున్న తీరు చూస్తుంటే కచ్చితంగా అనుకున్న దానికన్నా పై స్థాయిలోనే ఉన్నాడు.
పుజారా, రహానె శతక భాగస్వామ్యాన్ని ఎలా అంచనా వేస్తారు? ఆ సమయంలో వాళ్లపై ఒత్తిడి ఉండటం వల్ల స్కోరింగ్ రేట్ తగ్గిందని భావిస్తారా?
సచిన్:రెండో ఇన్నింగ్స్‌లో వాళ్లిద్దరూ చాలా కీలకమైన పాత్ర పోషించారు. వాళ్లు క్రీజులోకి వచ్చేటప్పటికి భారత్ చాలా తక్కువ స్కోరుకే మూడు వికెట్లు కోల్పోయింది. అదే సమయంలో మరో రెండు వికెట్లు కూడా పడి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి. కానీ, వాళ్ల బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. జట్టుకు మంచి చేయాలనేదే వారి ఆలోచన. అందుకు తగ్గట్టే ఆడారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ప్రతి ఒక్క బ్యాట్స్‌మన్ రాణించాలనుకుంటాం. కానీ, ఎల్లప్పుడూ అది సాధ్యంకాదు.